పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లిన బీఎస్ఎఫ్ జవానును తిరిగి అప్పగించిన పాకిస్తాన్-after 20 days pakistan rangers hand over bsf jawan at attari wagah checkpost ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లిన బీఎస్ఎఫ్ జవానును తిరిగి అప్పగించిన పాకిస్తాన్

పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లిన బీఎస్ఎఫ్ జవానును తిరిగి అప్పగించిన పాకిస్తాన్

Sudarshan V HT Telugu

పశ్చిమ బెంగాల్ కు చెందిన బీఎస్ఎఫ్ 24వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ పూర్ణం కుమార్ షా ఏప్రిల్ 23న ఫిరోజ్ పూర్ సెక్టార్లో పాక్ సరిహద్దుల్లో జీరో లైన్ ను అనుకోకుండా దాటడంతో అతడిని పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు.

బీఎస్ఎఫ్ జవానును తిరిగి అప్పగించిన పాకిస్తాన్

ఏప్రిల్ 23న తమకు పట్టుబడిన సరిహద్దు భద్రతా దళం జవాను పూర్ణమ్ కుమార్ షాను పాకిస్తాన్ రేంజర్లు బుధవారం పంజాబ్ లోని అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద భారత్ కు అప్పగించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు పాక్ రేంజర్లు కానిస్టేబుల్ ను బీఎస్ఎఫ్ కు అప్పగించారు. శాంతియుతంగా, నిబంధనలకు అనుగుణంగా అప్పగింత జరిగిందని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు.

పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే..

పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే, ఏప్రిల్ 23న ఫిరోజ్ పూర్ జిల్లాలోని అక్కడి రైతుల పంట పనులను పర్యవేక్షించే విధుల్లో ఉన్న పూర్ణమ్ కుమార్ షా అనుకోకుండా భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు ను దాటాడు. దాంతో అతడిని పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ‘‘పశ్చిమబెంగాల్ కు చెందిన బీఎస్ఎఫ్ 24వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ షా ప్రమాదవశాత్తు ఫిరోజ్ పూర్ సెక్టార్ లోని జీరో లైన్ దాటడంతో పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. అతడిని క్షేమంగా వెనక్కు తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి’’ అని ఆప్పుడు బీఎస్ఎఫ్ ప్రకటించింది.

రైతులకు తోడుగా..

ఘటన జరిగిన సమయంలో మామ్ దోట్ బ్లాక్ లోని సరిహద్దు కంచె వెంబడి తమ పంట పొలాల్లో గోధుమలు కోస్తున్న స్థానిక రైతుల బృందానికి ఆయన తోడుగా ఉన్నారు. ఆ సమయంలో యూనిఫామ్ లో ఉన్న షా తన జీ2 సర్వీస్ రైఫిల్ తో పాటు మూడు మ్యాగజైన్లు, 60 రౌండ్ల బుల్లెట్లను కలిగి ఉన్నాడు. అతడు పొరపాటున పాక్ భూభాగంలోకి ప్రవేశించడంతో అక్కడి రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. పంట కోత సమయంలో బీఎస్ఎఫ్ పర్యవేక్షణలో రైతులకు ఈ పొలాలకు ప్రవేశం లభిస్తుంది. ఈ సందర్భంలో షా మాత్రమే అనుకోకుండా సరిహద్దు దాటగా, రైతులు వెనుకబడ్డారు.

గందరగోళంగా సరిహద్దు

సరిహద్దు కంచెకు 150 మీటర్ల దూరంలో, భారత భూభాగంలో ఉన్న వ్యవసాయ భూములతో సహా ఈ ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపం కొత్త సిబ్బందికి గందరగోళంగా ఉంటుందని అధికారులు గుర్తించారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, సాధారణంగా ఫ్లాగ్ మీటింగ్స్, పరస్పర సమన్వయం ద్వారా పరిష్కరిస్తామని భద్రతా అధికారులు పేర్కొన్నారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.