Aero India 2025 : బెంగళూరులో ఏరో ఇండియా ఎయిర్ షో.. ఎదురెదురుగా అమెరికా, రష్యా యుద్ధ విమానాలు!
Aero India 2025 : నేటి నుంచి బెంగళూరులో ఏరో ఇండియా 2025 ప్రారంభమైంది. తొలిసారి రష్యా, అమెరికాకు చెందిన ఐదో తరం యుద్ధ విమానాలు ముఖాముఖిగా కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఆకట్టుకుంటున్నాయి.

ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో నేటి నుంచి ప్రారంభమైంది. దీనిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ప్రతిష్టాత్మకమైన ఈ ఎయిర్ షోకు ఇది 15వ ఎడిషన్. ఇందులో ఎన్నో అరుదైన దృశ్యాలు కనిపించాయి. చిరకాల ప్రత్యర్థి దేశమైన రష్యా, అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు తొలిసారి ముఖాముఖిగా కనిపించాయి. వైమానిక స్థావరం నుంచి రష్యా ఫైటర్ జెట్ ఎస్ యూ-57 టేకాఫ్ అవుతున్న దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. అమెరికా, రష్యాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు ఒకే ఫ్రేమ్‌లో నిలబడి కూడా ఉన్నాయి.
రష్యాకు చెందిన ఎస్‌యూ-57 ఫెలోన్ , అమెరికాకు చెందిన ఎఫ్ -35 లైటనింగ్ II యుద్ధ విమానాలు ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ఐదో తర యుద్ధ విమానాలుగా గుర్తింపు పొందాయి. ఈ రెండు యుద్ధ విమానాలు ఈ ప్రదర్శనలో భాగంగా ఉన్నాయి. ఇది ప్రపంచ రక్షణ సహకారానికి గణనీయమైన విజయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అద్భుతమైన దృశ్యానికి బెంగళూరు వేదికైంది. ఎస్ యూ-57, ఎఫ్-35 యుద్ధవిమానాలు నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ వైమానిక ప్రదర్శనల్లో పాల్గొంటాయి.
ఈ ఎయిర్ షోకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఎస్ యూ-57 విమానం యలహంక వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ తీసుకుంది. ఒక ఫోటోలో అమెరికా, రష్యా ఫైటర్ జెట్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించాయి. ఈ ఫొటోలో రెండు విమానాల సిబ్బంది ఒకరినొకరు చూసుకుంటూ ఆయా జెట్ విమానాల ఫొటోలు తీస్తున్నారు.
తొలిసారిగా అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఏఎంసీఏ) 1:1 స్కేల్ మోడల్‌ను ఈ ఎయిర్ షోలో ప్రదర్శించారు. ఈ మోడల్ ను ఎయిర్ షో ఇండియా పెవిలియన్‌లో ఉంచారు. గతంలో ఎల్‌సీఏ తేజస్‌ను తయారు చేసిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ ఏఎల్ ) ఈ ఏఎంసీఏను అభివృద్ధి చేయనుంది. ఈ యుద్ధ విమానం సింగిల్ సీటర్, ట్విన్ ఇంజిన్, ఐదవ తరం అత్యాధునిక జెట్. ఏఎంసీఏ అభివృద్ధికి ముందు హెచ్ఏఎల్ తొలుత ఎల్సీఏ తేజస్ మార్క్-2ను అభివృద్ధి చేయనుంది. 2024 మార్చిలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) ఏఎంసీఏ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
ఏరో ఇండియా 2025 ప్రారంభానికి ఒక రోజు ముందు భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణం చేశారు. ఇది తన జీవితంలో అత్యుత్తమ క్షణంగా జనరల్ ద్వివేది అభివర్ణించారు.