రిప్లింగ్ అనే హెచ్ఆర్ టెక్ కంపెనీ ఫౌండర్ ప్రసన్న శంకర్- ఆయన భార్య మధ్య ఉన్న గొడవలు ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కాయి! విడాకులు తీసుకుంటున్న సమయంలో వీరిద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కాగా తన భార్య దివ్య శశిధర్ చేసిన ఆరోపణలను శంకర్ సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టారు. వీరి మధ్య కొనసాగుతున్న వివాదాల మధ్య వారి 9ఏళ్ల కుమారుడు నలిగిపోతున్నాడు.
చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్.. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన రిప్లింగ్ అనే 10బిలియన్ డాలర్ల హెచ్ఆర్ టెక్ కంపెనీకి ఫౌండర్. తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఎన్ఐటీ తిరుచ్చి) విద్యార్థులుగా ఉన్నప్పుడు ప్రసన్న శంకర్, దివ్య శశిధర్ కలుసుకున్నారు. వీరికి 10 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇప్పుడు 9 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అతని సంరక్షణ వారి బహిరంగ పోరాటానికి కేంద్ర బిందువుగా ఉంది.
ప్రసన్న శంకర్ తన భార్య దివ్యపై చేసిన 5 ఆరోపణలు ఇవి..
అనూప్ అనే వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని శంకర్ తన ఎక్స్ అకౌంట్లో ఆరోపించాడు. ఆరు నెలలకు పైగా ఈ వ్యవహారం సాగిందని, అతనికి దివ్యకు మధ్య జరిగిన సంభాషణల స్క్రీన్ షాట్లను అనూప్ భార్య తనకు పంపడంతో ఈ వ్యవహారం గురించి తెలిసిందని టెక్ ఎంటర్ప్రెన్యూర్ పేర్కొన్నారు.
"నాకు, నా భార్య దివ్యకు పెళ్లై పదేళ్లు కాగా, మాకు 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అనూప్ అనే వ్యక్తితో 6 నెలలకుపైగా ఆమె ఎఫైర్ పెట్టుకుందని నేను తెలుసుకున్న తరువాత ఇటీవల మా వైవాహిక బంధం విచ్ఛిన్నమైంది," అని అనూప్ భార్య నుంచి తనకు వచ్చిన స్క్రీన్షాట్లను ఎక్స్‌లో పంచుకున్నారు.
తన భార్య తనపై గృహ హింస, అత్యాచారం సహా వరుస తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. విడాకుల సెటిల్మెంట్పై అసంతృప్తితోనే దివ్య ఈ తప్పుడు ఆరోపణలు చేసిందని ఆయన చెప్పారు.
ఆ తర్వాత విడాకుల్లో భాగంగా ఆమెకు ఎన్ని మిలియన్ డాలర్లు చెల్లించాలనే విషయంపై చర్చలు జరిపాం. దీంతో ఆమె అసంతృప్తికి గురై నేను కొట్టానని నాపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది," అని రాసుకొచ్చారు.
సింగపూర్‌కు చెందిన ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు తన భార్య తనపై తప్పుడు అత్యాచారం కేసు పెట్టిందని ఆరోపించారు. తన న్యూడ్ ఫొటోలను సర్క్యులేట్ చేశానన్న దివ్య ఆరోపణల్లో కూడా నిజం లేదని వివరించారు.
"సింగపూర్ పోలీసులు ఈ ఆరోపణలపై దర్యాప్తు చేశారు. అవి నిరాధారమైనవని కనుగొన్నారు. నన్ను అన్ని అభియోగాల నుంచి విముక్తి చేశారు," అని ఆయన ఎక్స్‌లో రాశారు.
తమ తొమ్మిదేళ్ల కుమారుడిని దివ్య కిడ్నాప్ చేసిందని ప్రసన్న శంకర్ ఆరోపించారు. తన నుంచి పెద్ద సెటిల్మెంట్ కోసం దివ్య భారత్‌లో కాకుండా అమెరికాలో విడాకుల కేసు వేసిందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత తన కుమారుడిని అపహరించి అమెరికాకు తీసుకెళ్లిందని వివరించారు.
'నేను అమెరికాలో అంతర్జాతీయ బాలల అపహరణ కేసు పెట్టాను. జడ్జి నాకు అనుకూలంగా తీర్పునిచ్చి బిడ్డను తిరిగి ఇవ్వాలని చెప్పారు," అని ప్రసన్న శంకర్ చెప్పారు.
సంబంధిత కథనం