Delhi High court : 'యుక్తవయస్సులో కలిగే నిజమైన ప్రేమను చట్టాలతో నియంత్రించలేము'
Delhi High court : యుక్తవయస్సులో కలిగిన నిజమైన ప్రేమను చట్టాలతో నియంత్రించలేమని వ్యాఖ్యానించింది దిల్లీ హైకోర్టు. ఓ కేసు విచారణలో భాగంగా ఈ విధంగా స్పందించింది.
Delhi High court on Adolescents true love : యుక్తవయస్సులో కలిగే నిజమైన ప్రేమను.. చట్టాలు, చర్యలతో నియంత్రించలేమని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. 9ఏళ్ల క్రితం, ఓ మహిళ మైనర్‌గా ఉన్నప్పుడు, ఆమెను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి, రేప్ చేశాడని దాఖలైన కేసును కొట్టివేస్తూ.. ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఇలాంటి సందర్భాల్లో.. యుక్తవయస్సులో ఉన్న వారికి న్యాయం చేసేందుకు పోలీసులు, ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను సమర్థించాలా? లేక పెళ్లి చేసుకుని, సుఖంగా, ప్రశాంతంగా ఉంటూ, చట్టాలకు లోబడి జీవితాన్ని సాగిస్తున్న వారికి మద్దతు పలకాలా? అన్న విషయంపై కోర్టులకు డైలమా ఉంటుందని పేర్కొంది.

"ఇద్దరు మనుషుల మధ్య కలిగే నిజమైన ప్రేమని.. చట్టాలు, చర్యలతో నియంత్రించలేమని అనేకమార్లు కోర్టులు చెప్పాయి. ఆ ఇద్దరు పెద్దవారైనా, మేజర్ అవ్వడానికి అడుగు దూరంలో ఉన్న వారైనా, ఇదే వర్తిస్తుంది," అని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.
దిల్లీ హైకోర్టు తాజాగా విచారించిన కేసు 2015 నాటిది. ఓ వ్యక్తి.. ఓ మైనర్ని కిడ్నాప్ చేసి, రేప్ చేశాడని పోలీసులు కేసు వేశారు. అయితే.. ఆమె అప్పటికే మేజర్ అని ఆ వ్యక్తి చెబుతున్నాడు. ఈ వ్యవహారంపై పూర్తిగా విచారించిన కోర్టు.. కేసును కొట్టివేసింది.
Delhi High court latest news : "ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ కేసును కొట్టివేయకపోతే.. వారి భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. అప్పుడు నిజమైన న్యాయం జరిగినట్టు అవ్వదు," అని జస్టిస్ స్వరన కాంత శర్మ తెలిపారు.
ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆ ఇద్దరు.. అబ్బాయి తరఫు కుటుంబసభ్యుల అనుమతితో.. ముస్లిం చట్టాలకు అనుగూణంగా పెళ్లి చేసుకున్నారు. అయితే.. తమ బిడ్డను కిడ్నాప్ చేశాడని, అమ్మాయి తండ్రి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అబ్బాయిని పట్టుకునే సరికి.. అమ్మాయి, 5 నెలల గర్భవతి అని తేలింది.
ఈ వ్యవహారంపై గత కొన్నేళ్లుగా విచారణ జరిగింది. విచారణ మొత్తంలోనూ.. ఆ అమ్మాయి.. అబ్బాయిని ప్రేమించి, ఇంట్లో నుంచి వచ్చేసినట్టే చెప్పింది. తనను ఎవరు బెదిరించలేదని, బలవంతం చేయలేదని పేర్కొంది. అంతేకాకుండా.. పెళ్లి చేసుకున్న సమయానికి తన వయస్సు 18ఏళ్లు అని కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో పోలీసులు పెట్టిన కేసు కన్నా అబ్బాయినే సమర్థిస్తూ అమ్మాయి మాట్లాడటాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. 9ఏళ్లుగా ఆ దంపతులు కలిసి సంతోషంగా జీవిస్తున్నారని, వారికి ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారని గుర్తించింది.
Delhi High court "ఆ కుటుంబం సంతోషంగా ఉంది. కానీ.. ఈ పిటిషన్ ఫలితంపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది. చట్టాలను అమలు చేయడంతో పాటు సమాజాన్ని కూడా అర్థం చేసుకునే బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంది. చట్టాలను అప్లై చేస్తే సరిపోతుంది అనుకోవడానికి లేదు. ఫార్ములాల ఆధారంగా రూల్స్‌ని ప్రతిసారి అప్లై చేయలేము. ఒక్కోసారి.. ఒకవైపు చట్టం నిలబడితే.. ఇంకోవైపు ఓ కుటుంబం మొత్తం నిలబడుతుంది. వారి భవిష్యత్తు నిలబడుతుంది. అందుకే ఈ కేసును కొట్టివేస్తున్నాము," అని దిల్లీ హైకోర్టు పేర్కొంది.
సంబంధిత కథనం