Disha Patani : రూ. 25లక్షలు మోసపోయిన దిశా పటానీ తండ్రి- ఉన్నత పదవి ఇప్పిస్తామని..
Disha Patani father job : దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీకి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసగాళ్లు రూ.25 లక్షలు మోసం చేశారు. మోసం, దోపిడీకి పాల్పడిన ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
దేశంలో ఆర్థిక నేరగాళ్ల బారిన పడుతున్న ప్రజల సంఖ్య రోజురోజుకు ఆందోళనకర రీతిలో పెరుగుతోంది! ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రి సైతం తాజాగా ఈ జాబితాలోకి చేరారు! ఉన్నత పదవి ఇప్పిస్తామని చెప్పి దిశా పటానీ తండ్రి నుంచి రూ. 25లక్షల వరకు వసూలు చేశారు. చివరికి అది స్కామ్ అని తేలింది.
ఇదీ జరిగింది..
నటి దిశా పటానీ తండ్రి ఒక రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఆయన పేరు జగదీష్ సింగ్ పటానీకి. ఆయనకి ప్రభుత్వ కమిషన్లో సీనియర్ పదవి ఇప్పిస్తామంటూ కొందరు మోసగాళ్లు రూ.25 లక్షలు మోసం చేశారు.
రూ.5 లక్షల నగదు రూపంలో, మరో రూ. 20లక్షల వరకు మూడు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మొత్తం మీద రూ. 25లక్షలు మోసపోయారు దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ.
శివేంద్ర ప్రతాప్ సింగ్, దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాష్, ప్రీతి గార్గ్, మరో గుర్తుతెలియని వ్యక్తిపై మోసం, క్రిమినల్ బెదిరింపు, దోపిడీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
జగదీష్ సింగ్ పటానీ ఫిర్యాదు..
బరేలీ సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన దిశా పటానీ తండ్రి తన ఫిర్యాదులో తనకు పరిచయస్తుడైన శివేంద్ర ప్రతాప్ సింగ్.. దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాష్ అనే వ్యక్తులకు పరిచయం చేశాడని తెలిపారు.
నిందితులు తనకు బలమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయని, చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర సీనియర్ ప్రభుత్వ పదవుల్లో ఒకటి ఇస్తామని పటానీకి హామీ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం వారి సహచరుడు హిమాన్షును "ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ"గా కూడా పరిచయం చేసినట్టు తెలుస్తోంది.
మొత్తం చెల్లించిన తర్వాత కూడా ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆ డబ్బును వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారని రిటైర్డ్ పోలీసు అధికారి జగదీష్ పటానీ ఆరోపించారు.
ఈ ఘటనపై కేసు నమోదు కాగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దిశా పటానీ గురించి..
ఇటీవల తమిళ సూపర్ స్టార్ సూర్య సరసన కంగువా చిత్రంలో నటించింది దిశా పటానీ. నవంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
కంగువ సినిమాలో 1,500 సంవత్సరాల క్రితం నాటి సన్నివేశాలు, యాక్షన్, హిస్టారికల్ ఎలిమెంట్స్ మేళవింపుగా ఉన్నాయి. సూర్య ద్విపాత్రాభినయం చేస్తూ మోడ్రన్, స్టైలిష్ పాత్రతో పాటు గతం నుంచి భీకర, యోధుడి లాంటి వ్యక్తిగా కనిపించనున్నాడు. బాబీ డియోల్ ఇంటెన్స్ విలన్గా నటించాడు.
ఇంతకుముందు, దిశా కల్కి 2898 ఏడిలో కనిపించింది, అక్కడ ఆమె ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె మరియు కమల్ హాసన్ లతో స్క్రీన్ స్పేస్ పంచుకుంది. ఈ సినిమాలో ఆమె ప్రభాస్ పాత్రకు ప్రేయసిగా నటించింది.
సంబంధిత కథనం