Monsoon: ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం; ఐఎండీ అంచనా-above normal rainfall this monsoon in india predicts imd ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Monsoon: ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం; ఐఎండీ అంచనా

Monsoon: ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం; ఐఎండీ అంచనా

Sudarshan V HT Telugu

Monsoon: ఈ సారి వర్షాకాలంలో భారత్ లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదువుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా భారత్ లో రుతుపవనాల వర్షాలపైననే అత్యధిక శాతం వ్యవసాయం అధారపడి ఉంటుంది.

సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం

ఈ సంవత్సరం భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచనా ఒక రకంగా రైతులకు శుభవార్త. భారత్ లో అత్యధిక శాతం వర్షాధార రైతులే. వ్యవసాయ రంగంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది శుభవార్త. జనాభాలో 42 శాతం కంటే ఎక్కువ మంది జీవనోపాధి కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. అంతేకాదు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో ఈ రంగం వ్యవసాయ రంగం వాటా 18%గా ఉంది.

వర్షాధార వ్యవసాయం

దేశంలోని నికర సాగు విస్తీర్ణంలో, 52 శాతం రుతుపవనాల వర్షంపై ఆధారపడి ఉంటుంది. తాగునీటి సరఫరాతో పాటు విద్యుత్ ఉత్పత్తికి కూడా రుతుపవాన వర్షాలు కీలకం. "భారతదేశంలో నాలుగు నెలల రుతుపవన కాలంలో (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సగటు 87 సెం.మీ.లో 105 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నాం’’ అని అని భారత వాతావరణ శాఖ (IMD) చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర అన్నారు.

ఎల్ నినో లేదు

భారత ఉపఖండంలో ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితులు లేవని ఐఎండీ వెల్లడించింది. సాధారణంగా ఎల్ నినో పరిస్థితులు నెలకొని ఉంటే సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం ఎల్ నినో పరిస్థితులు అభివృద్ధి చెందే అవకాశం లేదని ఐఎండీ తెలిపింది.

జూన్ 1 నుంచి..

భారత్ లో సాధారణంగా రుతుపవనాలు కేరళలో జూన్ 1న తీరం దాటుతాయి. సెప్టెంబర్ లో రుతుపవనాలు వెనక్కు వెళ్తాయి. కాగా, ఇటీవలి కాలంలో వర్షాకాలం రోజుల సంఖ్య తగ్గుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్వల్ప సమయంలో అత్యధిక వర్షపాతం నమోదు చేసే భారీ వర్షాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. దీనివల్ల తరచుగా కరువులు, లేదా వరదలు సంభవిస్తున్నాయని వివరిస్తున్నారు. వర్షాకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం అంటే అది సమానంగా పంపిణీ అవుతుందని అర్థం కాదు అన్న విషయం గమనించాలి.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.