Telugu News  /  National International  /  Abha Health Card How To Apply And Download
ABHA Health Card: ఆరోగ్య వివరాలన్నీ ఒకే కార్డులో..
ABHA Health Card: ఆరోగ్య వివరాలన్నీ ఒకే కార్డులో..

ABHA Health Card: ఆరోగ్య వివరాలన్నీ ఒకే కార్డులో.. ఏబీహెచ్‍ఏ కార్డును మీరే జనరేట్ చేసుకోవచ్చు

26 January 2023, 11:24 ISTChatakonda Krishna Prakash
26 January 2023, 11:24 IST

ABHA Health Card: ఆరోగ్యానికి సంబంధించి రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి.. ఐడీ ద్వారా వివరాలను యాక్సెస్ చేసుకునేందుకు ఏబీహెచ్ఏ హెల్త్ కార్డు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ABHA కింద మీరు పేరు ఇంకా నమోదు కాకపోతే.. మీరు స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

ABHA Health Card Benefits: ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA)ను 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీన్ని ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడీగానూ పిలుస్తారు. భారత పౌరులందరికీ డిజిటల్ హెల్త్ ఐడీని ఇచ్చేందుకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం దీన్ని ప్రవేశపెట్టింది. జాతీయ ఆరోగ్య సంస్థ (National Health Authority - NHA) దీన్ని అమలు చేస్తోంది. ఈ ఏబీహెచ్‍ఏ హెల్త్ కార్డుకు 14 అంకెల యూనిక్ నంబర్ ఉంటుంది. ఆరోగ్య వివరాలను ప్రజలు ఈ నంబర్‌తో డిజిటలైజ్ చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు, ల్యాబ్ రిపోర్టులు, మీరు వినియోగిస్తున్న మందులు ఇలా మీ మెడికల్ రికార్డులన్నింటీనీ ఈ ABHA హెల్త్ కార్డులో నమోదు చేయవచ్చు. మీ మెడికల్ రికార్డులను ఆసుపత్రులు, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ హెల్త్ కార్డు యూనిక్ ఐడీతోనే సమర్పించవచ్చు. పేపర్లు పట్టుకొని తిరగాల్సిన అవసరం ఉండదు. ఇలా మీ ఆరోగ్య వివరాలన్నీ ఈ కార్డులో నమోదు చేసుకోవచ్చు. ఇంతవరకు ఏబీహెచ్‍ఏ కింద నమోదు కాని వారు స్వయంగా కూడా జనరేట్ (ABHA Health Card Apply) చేసుకోవచ్చు. ఆన్‍లైన్‍లో సులభంగా ఈ హెల్త్ కార్డును పొందవచ్చు. అదెలా అంటే..

ట్రెండింగ్ వార్తలు

ABHA కార్డును ఆన్‍లైన్‍లో జనరేట్ చేసుకోండిలా..

  • ముందుగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అధికారిక వెబ్‍సైట్‍ (abdm.gov.in) లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో క్రియేట్ క్రియేట్ ఏబీహెచ్ఏ నంబర్ (Create ABHA Number) బటన్‍పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత ఆధార్ కార్డు నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఎంటర్ చేయాలి.
  • అనంతరం మీ ఆధార్‌కు లింక్‍ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఆ తర్వాత పేరు, వయసు లాంటి కొన్ని వివరాలను నమోదు చేయాలి.
  • ప్రొఫైల్ వివరాలు అన్ని ఎంటర్ చేశాక సబ్‍మిట్ చేయాలి. అంతే ABHA ID క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత ABHA హెల్త్ కార్డును మీరు డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆరోగ్య సిబ్బందితో సర్వే నిర్వహించి.. చాలా మంది ప్రజలను ABHA కింద నమోదు చేశాయి. ఇప్పటికే ABHA నంబర్ ఉన్న ఈ వెబ్‍సైట్‍లోనే ఆధార్ కార్డు నంబర్, ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి ABHA హెల్త్ కార్డు డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే ABHA ఐడీ పూర్తిస్థాయిలో అమలయ్యే అవకాశం ఉంది.