Satyendar Jain Jail Video: జైలులో మసాజ్.. బయటి ఫుడ్! సత్యేందర్ 8కేజీల బరువు పెరిగారట..-aap minister satyendra jain being served outside food new footage shows ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Aap Minister Satyendra Jain Being Served Outside Food New Footage Shows

Satyendar Jain Jail Video: జైలులో మసాజ్.. బయటి ఫుడ్! సత్యేందర్ 8కేజీల బరువు పెరిగారట..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 23, 2022 11:44 AM IST

AAP Minister Satyendra Jain jail Video: తీహార్ జైలులో ఉన్న ఆమ్‍ఆద్మీ మంత్రి సత్యేందర్ జైన్‍కు బయటి నుంచి తెచ్చిన ఆహారాన్ని పెడుతున్నట్టు తాజాగా మరో వీడియో బయటికి వచ్చింది. మసాజ్ వ్యవహారం చల్లబడక ముందే మరో దుమారం రేగింది.

జైలులో మసాజ్.. బయటి ఫుడ్! కారాగారంలోనే 8కేజీల బరువు పెరిగారట..
జైలులో మసాజ్.. బయటి ఫుడ్! కారాగారంలోనే 8కేజీల బరువు పెరిగారట.. (HT_Photo)

Satyendra Jain jail Video: మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్.. తీహార్ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ బీజేపీ విమర్శలు కురిపిస్తోంది. ఈ క్రమంలోనే జైలులో సత్యేందర్ జైన్.. మసాజ్ చేయించుకుంటున్న వీడియో ఒకటి లీకైంది. అది ఫిజియోథెరపి అని ఆమ్‍ఆద్మీ వాదించింది. అయితే మసాజ్ చేసింది ఓ రేప్ కేసులో నిందితుడు అని తేలడంతో ఈ అంశం రాజకీయంగా దుమారం రేపింది. బీజేపీ ఆరోపణలకు బలం చేకూర్చింది. ఈ మసాజ్ కలకలం పూర్తి కాక ముందే తాజాగా తీహార్ జైలు నుంచి మరో వీడియో బయటికి వచ్చింది. తనకు జైలులో సరైన ఆహారం ఇవ్వడం లేదని, 28 కేజీలు తగ్గానని సత్యేంద్ర జైన్ చెప్పిన ఒక్క రోజు తర్వాత ఇది రావడం మరింత ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Satyendar Jain Jail Video: బయటి ఫుడ్, డ్రైఫ్రూట్స్ తింటూ..

బయటి నుంచి తెచ్చిన ఆహారాన్ని ఆప్ మంత్రి సత్యేందర్ జైన్.. తీహార్ జైలులోని సెల్‍లో తింటున్నట్టు తాజాగా ఓ వీడియో బయటికి వచ్చింది. ఈ సెల్‍లోనే ఆయన మసాజ్ చేయించుకున్నట్టు కూడా ఇటీవల ఓ వీడియో లీకైంది. ఇప్పుడు తాజాగా, ఓ వ్యక్తి బయటి నుంచి ఫుడ్ తీసుకొచ్చి ఆయన సెల్‍లో ఇచ్చినట్టు వీడియోలో వెల్లడైంది. తిన్న తర్వాత బాక్స్ లను పారేసేందుకు డస్ట్ బిన్‍ను కూడా ఆ వ్యక్తి పెట్టి వెళ్లాడు. సత్యేందర్ జైన్ బెడ్ కింద చాలా డిస్పోజల్ బాక్స్ లు ఉన్నట్టు కూడా కనిపించింది. సత్యేంద్ర జైన్.. పండ్లు, డ్రైఫ్రూట్స్ తింటున్నట్టుగా కూడా ఆ వీడియోలో ఉంది.

8 కేజీల బరువు పెరిగారట..

తీహార్ జైలులో ఉంటూ సత్యేందర్ జైన్.. 8 కిలోల బరువు పెరిగారట. తీహార్ జైలు వర్గాలు ఈ విషయాన్ని చెప్పాయని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. సత్యేందర్ జైన్‍కు సరైన ఆహారం అందిస్తున్నట్టు జైలు అధికారులు తెలిపారని పేర్కొంది.

ఇదిలా ఉండగా.. జైలులో తనకు సరైన ఆహారం అందడం లేదని, ఏకంగా 28 కిలోల బరువు తగ్గానని సత్యేందర్ జైన్.. మంగళవారమే చెప్పారు. ఆయన తరఫు లాయర్ ఈ వివరాలను వెల్లడించారు. అయితే తీహార్ జైలు అధికారులు మాత్రం ఆయన 8కిలోల బరువు పెరిగారని చెబుతున్నట్టు తెలుస్తోంది.

రిసార్ట్ లో ఉన్నట్టు : బీజేపీ

ఈ ఫుడ్ వీడియోను షేర్ చేస్తూ.. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా విమర్శలు కురిపించారు. రేపిస్ట్ తో మసాజ్ చేయించుకొని ఫిజియోథెరపిస్ట్ గా మభ్య పెట్టాలని చూశారని, ఇప్పుడేమో సత్యేందర్ జైన్‍కు బయటి ఫుడ్ కూడా పెడుతున్నట్టు వీడియోలో తెలుస్తోందని అన్నారు. “ ఓ రెస్టారెంట్‍లోనో, రిసార్ట్ లోనే ఉన్నట్టు ఇద్దరు సహాయకులతో ఆయనకు బయటి నుంచి తెచ్చిన ఆహారాన్ని ఇస్తున్నారు. రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలు ఆయన ముందు కనిపిస్తున్నాయి. అవినీతి చేసినందుకు శిక్షగా ఆయన అక్కడ ఉన్నట్టు లేదు. మసాజ్, రెస్టారెంట్ ఫుడ్‍తో మజా చేసేందుకు వెళ్లినట్టుగా ఉంది” అని షెహజాద్ ఆరోపించారు.

IPL_Entry_Point