Aam Aadmi: ఆమ్ఆద్మీ ఇక జాతీయ పార్టీ: హోదా కోల్పోయిన ఆ మూడు పార్టీలు
Aam Aadmi: ఆమ్ఆద్మీ పార్టీ.. అధికారికంగా జాతీయ పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి జాతీయ హోదాను ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, మూడు పార్టీలు జాతీయ పార్టీ హోదాను కోల్పోయాయి.
Aam Aadmi: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party - AAP) జాతీయ పార్టీ హోదా(National Party Status)ను దక్కించుకుంది. ఈ విషయాన్ని భారత ఎన్నికల సంఘం (Election Commission of India - ECI) సోమవారం అధికారికంగా ప్రకటించింది. పార్టీల హోదా జాబితాను సవరించింది. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆమ్ఆద్మీ అధికారంలో ఉంది.
Aam Aadmi: ఢిల్లీ, గోవా, గుజరాత్, పంజాబ్ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ ఆధారంగా ఆప్‍ను జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం ప్రకటించింది. జాతీయ హోదా రావటం పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు.
అద్భుతమే ఇది
Aam Aadmi - Arvind Kejriwal “ఇంత తక్కువ సమయంలో జాతీయ పార్టీ హోదా?. అది అద్భుతం కంటే తక్కువేం కాదు. అందరికీ చాలా అభినందనలు. దేశంలోని కోట్లాది మంది మమ్మల్ని ఈ దశకు చేర్చారు. మా నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు. ప్రజలు మాకు ఇప్పుడు చాలా పెద్ద బాధ్యతను ఇచ్చారు. మా బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చేందుకు దేవుడు మమ్మల్ని దీవించాడు” అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 2012లో ఆమ్ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ స్థాపించారు. గతేడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతోనే జాతీయ పార్టీకి కావాల్సిన అర్హతలను ఆప్ పొందింది. అయితే, ఎన్నికల సంఘం ఇప్పుడు అధికారికంగా జాబితాలో చేర్చింది.
మూడు పార్టీలకు ఎదురుదెబ్బ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), భారత కమ్యూనిస్టు పార్టీ (CPI).. జాతీయ హోదాను ఎన్నికల సంఘం తొలగించింది. ఆ మూడు పార్టీలకు రాష్ట్ర పార్టీ హోదాను ఇచ్చింది.
ఓ రాజకీయ పార్టీకి జాతీయ హోదా ఉండాలంటే, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. లేదా దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ రెండు శాతం చొప్పున ఓట్లు పొందాలి. లేకపోతే, గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి చెందిన అభ్యర్థులు కనీసం నాలుగు రాష్ట్రాల్లో పోలైన మొత్తం ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లను సాధించాలి. నాలుగు వేర్వేరు రాష్ట్రాల నుంచి కనీసం 4 ఎంపీ సీట్లలో గెలవాలి.
ఒక్కసారి జాతీయ హోదా కోల్పోతే.. గుర్తింపు పొందని రాష్ట్రాల్లో ఆ పార్టీలు కామన్ సింబల్‍ను పొందలేవు. ఉదాహణరకు, జాతీయ హోదా కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్.. కర్ణాటక ఎన్నికల్లో తన పార్టీ గుర్తుతో ఆ రాష్ట్రంలో పోటీకి దిగలేదు. వేరే గుర్తు లభిస్తుంది.
తాజా సవరణ తర్వాత, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (BSP), నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP), ఆమ్ఆద్మీ.. జాతీయ పార్టీలుగా ఉన్నాయి.
రాష్ట్ర పార్టీగానే బీఆర్ఎస్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (BRS).. రాష్ట్ర పార్టీగా కొనసాగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‍లో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును తొలగించింది.
జాతీయ పార్టీ హోదా దక్కడం.. కర్ణాటక ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీకి కలిసి వచ్చే అంశంగా ఉంది. ఆ రాష్ట్రంలోని అన్ని 224 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ పోటీకి దిగనుంది. మే 10న ఒకే దశలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
సంబంధిత కథనం