పిల్లలు జన్మించగానే, వారికి జన్మ ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్ ఎన్ రోల్ మెంట్ జరిగేలా Unique Identification Authority of India (UIDAI) చర్యలు తీసుకుంటోంది. మరి కొన్ని నెలల్లో అన్ని రాష్ట్రాల్లో ఈ సదుపాయం లభించనుంది.
నవజాత శిశువులకు ఆధార్ ఎన్ రోల్ మెంట్ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. మరికొన్ని నెలల్లో ఈ సదుపాయాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయలని యూఐడీఏఐ భావిస్తోంది. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో ‘ఆధార్ లింక్డ్ బర్త్ రిజిస్ట్రేషన్’ అందుబాటులో ఉందని UIDAI అధికారి ఒకరు వెల్లడించారు. ఆధార్ లింక్డ్ బర్త్ రిజిస్ట్రేషన్ వల్ల పిల్లల తల్లిదండ్రులకు పిల్లలను మళ్లీ ఆధార్ కేంద్రాలకు తీసుకువెళ్లాల్సిన అవసరం తప్పుతుందని వివరించారు.
అయితే, ఐదేళ్ల లోపు పిల్లలకు బయోమెట్రిక్స్ ను క్యాప్చర్ చేయడం సాధ్యం కాదు. అందువల్ల వారి నుంచి ఆధార్ ఎన్ రోల్ మెంట్ సమయంలో ఫొటోతో పాటు సాధారణ సమాచారం మాత్రమే సేకరిస్తారు. ఆ తరువాత పిల్లలకు ఐదేళ్ల వయస్సు దాటిన తరువాత బయోమెట్రిక్స్ తీసుకుంటారు. మళ్లీ 15 ఏళ్లు దాటిన తరువాత మరోసారి బయోమెట్రిక్స్ తీసుకుంటారు.
ప్రభుత్వం అందించే అనేక సేవలు, సంక్షేమ పథకాలను పొందడానికి ఆధార్ తప్పని సరి. ఆధార్ సర్టిఫికెట్ ను ప్రభుత్వం ఉచితంగానే అందిస్తోంది. దాాదాపు 1000 కి పైగా కేంద్రం, రాష్ట్రాలు అందించే ప్రయోజనాలకు ఆధార్ లింకింగ్ తప్పని సరి. దీనివల్ల పథకాల దుర్వినియోగం గణనీయంగా తగ్గింది. ఇప్పటివరకు 134 కోట్ల ఆధార్ కార్డులను జారీ చేశారు.