Saudi Arabia accident: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం; 9 మంది భారతీయుల దుర్మరణం; మృతుల్లో తెలంగాణ వాసి
Saudi Arabia accident: సౌదీ అరేబియాలోని జిజాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మరణించారు. వారిలో తొమ్మిది మంది భారతీయులు ఉన్నారు. జెడ్డాలోని భారత కాన్సులేట్ బాధిత కుటుంబాలకు సమాచారం అందించి, అవసరమైన సహాయ చర్యలు చేపట్టింది.
Saudi Arabia accident: పశ్చిమ సౌదీ అరేబియాలోని జిజాన్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు సహా 15 మంది దుర్మరణం పాలయ్యారు. భారతీయుల్లో తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం ఈ సమాచారాన్ని వెల్లడించింది. ‘‘సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది భారతీయులు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అని భారత రాయబార కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసింది. బాధిత కుటుంబాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని, అధికారులు, కుటుంబాలతో టచ్ లో ఉన్నామని తెలిపింది. బాధిత కుటుంబాల కోసం కాన్సులేట్ హెల్ప్ లైన్ నంబర్లు - 8002440003(టోల్ ఫ్రీ), 0122614093-0126614276- 0556122301 (వాట్సప్) కూడా విడుదల చేసింది.
పోర్ట్ సిటీ జిజాన్
సౌదీ అరేబియాలో దక్షిణ ఓడరేవు నగరమైన జిజాన్ లో 26 మంది కార్మికులు తమ వర్క్ సైట్ కు బస్సులో వెళ్తుండగా వారి బస్సు ట్రయిలర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ‘‘అసిర్ ప్రావిన్స్ లోని వాడి బిన్ హష్బల్ ప్రాంతంలో ఆదివారం ఉదయం 6 గంటలకు ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పవిత్ర నగరమైన మక్కాకు ఇది దక్షిణాన ఉంది" అని సౌదీ రెడ్ క్రెసెంట్ ప్రతినిధి అహ్మద్ అసిరి తెలిపారు.
మృతుల్లో తెలంగాణ వాసి
మరణించిన 15 మందిలో తొమ్మిది మంది భారతీయులు కాగా, మిగిలిన ఆరుగురిలో నేపాల్, ఘనాకు చెందిన ముగ్గురు చొప్పున ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు తెలంగాణ (telangana) జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలానికి చెందిన కపెల్లి రమేష్ (32)గా గుర్తించారు. గాయపడిన 11 మందిలో ఇద్దరు తెలంగాణకు చెందిన కార్మికులు ఉన్నారు. ప్రమాదం, ప్రాణనష్టం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. జెడ్డాలోని భారత కాన్సుల్ జనరల్తో మాట్లాడానని, ఆయన సంబంధిత కుటుంబాలతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని జై శంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.