Cardiac arrest: ఎనిమిదేళ్ల పాపకు స్కూల్ లో గుండెపోటు; ఆసుపత్రికి తరలించేలోపే మృతి
Cardiac arrest: ఒకప్పుడు నడి వయస్సు వారికో లేక వృద్ధులకో గుండెపోటు వచ్చేది. కానీ, ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు ప్రాణాలను తీస్తోంది. తాజాగా, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పాఠశాలలో గార్గి రంపారా అనే ఎనిమిదేళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది.
Cardiac arrest: 3వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందిన ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. గుజరాత్ లోని తల్తేజ్ ప్రాంతంలో ఉన్న జెబార్ స్కూల్ ఫర్ చిల్డ్రన్ లో గార్గి రాన్ పారా అనే బాలిక ఉదయం కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రెండో మరణం
చిన్న పిల్లలు గుండెపోటుతో చనిపోయిన ఘటనలు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితమే కర్ణాటకలోని ఓ పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలిక కుప్పకూలి మృతి చెందింది. ఆ మర్నాడే గుజరాత్ లోని ఒక స్కూల్ లో గుండెపోటుతో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటుతో చిన్నారులు మృతి చెందడం రెండు రోజుల్లోఇది రెండోసారి.
ఉదయం సాధారణంగానే..
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన వివరాల ప్రకారం.. ఉదయం పాఠశాలకు వచ్చినప్పుడు గార్గి రంపారా అనే 8 ఏళ్ల ఆ చిన్నారి మామూలుగానే ఉంది. అనంతరం, తరగతి గదికి వెళ్తుండగా ఆమెకు అసౌకర్యంగా అనిపించింది. దాంతో, అక్కడే లాబీలో ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆ కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో గార్గిని ఆస్పత్రికి తరలించగా ఆమెకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు ప్రకటించారని గుజరాత్ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. పాఠశాల యాజమాన్యం షేర్ చేసిన సీసీటీవీ వీడియోలో గార్గి రాన్పారా లాబీలో నడుచుకుంటూ తన తరగతి గది వైపు వెళ్తుండటాన్ని చూడవచ్చు. కానీ మార్గమధ్యంలో ఆమె అసౌకర్యంగా అనిపించి, లాబీలో కుర్చీలో కూర్చుంది. అక్కడి ఉపాధ్యాయులు, ఇతర విద్యార్థుల సమక్షంలో అపస్మారక స్థితిలోకి వెళ్లి, కుర్చీ నుంచి జారిపడి పోయింది.
కర్నాటకలో మరో బాలిక..
బెంగళూరుకు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న చామరాజనగర్ కు చెందిన తేజస్విని అనే ఎనిమిదేళ్ల విద్యార్థిని రెండు రోజుల క్రితం గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. గుజరాత్ లో పాఠశాల విద్యార్థిని ఎలా చనిపోయిందో, తేజస్విని కూడా అదే తరహాలో చనిపోయింది. తోటి విద్యార్థులతో ఉన్నప్పుడు పాఠశాల కారిడార్లలోనే కుప్పకూలిపోయింది. వెంటనే పాఠశాల సిబ్బంది తేజస్వినిని జేఎస్ఎస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యబృందం ఎంత ప్రయత్నించినా ఆమె కోలుకోలేదు. అనంతరం ప్రాణాలు కోల్పోయింది. ఆ బాలిక గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.