8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘానికి కేబినెట్ ఆమోదం
8వ వేతన సంఘం: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 8వ వేతన సంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల అలవెన్సులను సవరించేందుకు 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 8వ వేతన సంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కమిషన్ చైర్మన్, ఇద్దరు సభ్యులను త్వరలోనే నియమిస్తామని మంత్రి తెలిపారు.

ప్రతీ పదేళ్లకు ఒకసారి..
ఉద్యోగుల వేతన వ్యవస్థను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి దశాబ్దానికి ఒకసారి వేతన సంఘాన్ని (pay commission) ఏర్పాటు చేస్తుంది. వేతన నిర్మాణాన్ని సవరించడంతో పాటు, ప్రతి వేతన కమిషన్ కు ప్రత్యేక టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ (టిఓఆర్) ఉంటుంది, ఇది దాని దృష్టిని స్థూలంగా నిర్వచిస్తుంది. వేతన కమిషన్లు పెన్షన్ చెల్లింపులను కూడా నిర్ణయిస్తాయి. 7వ వేతన సంఘం 2016లో ఏర్పాటవగా, దాని కాలపరిమితి 2026తో ముగియనుంది.
వేతన కమిషన్ల పరిధిలోకి ఎవరు వస్తారు?
7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పే కమిషన్ పరిధిలోకి వస్తారు. కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ లో ఉన్న వ్యక్తులు, ప్రభుత్వం తన ఆదాయాన్ని సేకరించే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి జీతాలు చెల్లించే వారు పే కమిషన్ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలు(PSU), స్వయంప్రతిపత్తి సంస్థల ఉద్యోగులు, గ్రామీణ డాక్ సేవకులు 7వ వేతన సంఘం పరిధిలోకి రారు. పీఎస్ యూ ఉద్యోగులకు వారు పనిచేస్తున్న అండర్ టేకింగ్ ను బట్టి ప్రత్యేక పే స్కేల్స్ ఉంటాయి.
7వ వేతన సంఘంలో చేసిన మార్పులేంటి?
7వ వేతన సంఘం వేతన సవరణ విషయంలో 3.68 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయగా, ప్రభుత్వం 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను నిర్ణయించింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది జీతాలు, పెన్షన్లను లెక్కించడానికి ఉపయోగించే గుణకం. 7వ వేతన సంఘం ద్వారా కనీస మూల వేతనం నెలకు రూ.18,000 లకు పెరిగింది. ఇది ఆరో వేతన సంఘంలో రూ.7,000గా ఉంది. అలాగే, కనీస పింఛను రూ.3,500 నుంచి రూ.9,000కు పెరిగింది. గరిష్ట వేతనం రూ.2,50,000, గరిష్ట వేతనం రూ.1,25,000 లుగా మారింది.