Mobile phone explodes: మొబైల్ ఫోన్ పేలి 8 ఏళ్ల చిన్నారి మృతి
Mobile phone explodes: కేరళలోని త్రిసూర్ జిల్లాలో మొబైల్ ఫోన్ పేలి ఎనిమిది సంవత్సరాల చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది.
Mobile phone explodes: కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక పంచాయతి బోర్డు సభ్యుడు అరుణ్ కుమార్ కూతురు 8 ఏళ్ల ఆదిత్య శ్రీ మొబైల్ ఫోన్ లో వీడియో చూస్తుండగా, ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Mobile phone explodes: పెద్ద శబ్దంతో..
స్కూల్స్ కు సెలవులు ఇవ్వడంతో.. రోజులో ఎక్కువ సమయం పిల్లలు మొబైల్ ఫోన్ తోనే గడుపుతున్నారు. అలాగే, ఆదిత్య శ్రీ కూడా మొబైల్ ఫోన్ లో గంటల తరబడి వీడియోలు చూస్తుండేదని ఆ చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం కూడా అలాగే మొబైల్ లో వీడియోలు చూస్తుండగా, ఒక్కసారిగా పాప చేతిలోని ఫోన్ పేలిపోయింది. దాంతో, పాప చేయి, ముఖం, పొత్తి కడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో ఆ పాపతో పాటు ఆమె నానమ్మ మాత్రమే ఉన్నారు. ఫోన్ పేలినప్పుడు పెద్ద సౌండ్ రావడంతో స్థానికులు హుటాహుటిన వచ్చి, పాపను ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తూ అప్పటికే ఆ పాప చనిపోయింది. మొబైల్ ఫోన్ లోని బ్యాటరీ పేలడం వల్లనే పేలుడు సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గత మూడేళ్లుగా ఆ ఫోన్ వాడుతున్నారని, మూడు నెలల క్రితమే బ్యాటరీని మార్చారని వెల్లడించారు. చాలా సేపటి నుంచి ఫోన్ లోని వీడియోలు చూస్తుండడంతో, మొబైల్ తీవ్రంగా వేడెక్కి బ్యాటరీ పేలి పోయి ఉంటుందని భావిస్తున్నారు. పేలుడు జరిగిన మొబైల్ ఫోన్ ను ఫొరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఫొరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాతనే పేలుడుకు కచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. గతంలో కూాడా మొబైల్ పేలిన ఘటనలు చోటు చేసుకున్నాయి కానీ అవి స్వల్పమైన తీవ్రతతో పేలాయి.