Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్; 8 మంది మావోయిస్టులు మృతి
Chhattisgarh encounter: వరుస ఎన్ కౌంటర్ లతో మావోయిస్ట్ లకు భారీగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా, శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భద్రతాబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు.
Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉదయం 8.30 గంటల సమయంలో భద్రతా సిబ్బంది సంయుక్తంగా నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఎదురుకాల్పులు జరిగాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ఫోర్స్ (STF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), దాని ఎలైట్ యూనిట్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్) సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందరరాజ్ పి తెలిపారు.

ఈ ఏడాది 48 మంది
పశ్చిమ బస్తర్ డివిజన్ మావోయిస్టుల ఉనికిపై నిఘా వర్గాల సమాచారం మేరకు శుక్రవారం ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఐజీ తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం ఉందని సుందర్రాజ్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్ కౌంటర్ తో ఈ ఏడాది ఇప్పటి వరకు చత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో 48 మంది మావోయిస్టులు హతమయ్యారు. జనవరి 16న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. జనవరి 16న జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోలు చనిపోయారని మావోయిస్టులు ఒక ప్రకటనలో అంగీకరించారు. గత ఏడాది రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్ లలో 219 మంది మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.