Japan Earthquake : జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ!
Japan Earthquake : జపాన్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
నైరుతి జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. దీంతో పాటు వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఎంతమేర నష్టం జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:19 గంటలకు సంభవించింది. భూకంప కేంద్రం క్యుషు నైరుతి ద్వీపంలో ఉంది. మియాజాకి ప్రిఫెక్చర్‌తో పాటు పక్కనే ఉన్న కొచ్చి ప్రిఫెక్చర్‌కు సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఈ రెండు ప్రావిన్సులకు అలర్ట్ ఇచ్చారు.

యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం భూకంపం 37 కి.మీ లోతులో సంభవించింది. గత సంవత్సరం ఆగస్టు 8, 2024న జపాన్‌లో 6.9, 7.1 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. దీని ప్రభావం క్యుషు, షికోకులలో ఎక్కువగా అగుపించింది.
ప్రస్తుతం నైరుతి జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం రావడంతో జనాలు ఒక్కసారిగా భయపడ్డారు. అధికారులు పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆస్తి నష్టం, ప్రాణనష్టం గురించి ఇంకా వివరాలు తెలియవు.
2004 భూకంపం
పసిఫిక్ బేసిన్‌లోని అగ్నిపర్వతాలు, ఫాల్ట్ లైన్‌ల ఆర్క్ అయిన రింగ్ ఆఫ్ ఫైర్ వెంబడి ఉన్నందున జపాన్ తరచుగా భూకంపాలకు గురవుతూ ఉంటుంది. 2004లో జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత సునామీ వచ్చింది. ఈ సునామీని జపాన్ ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. ఎంత నష్టం జరిగింది. భూకంపం తర్వాత వచ్చిన సునామీ కారణంగా జపాన్‌లో వేలాది మంది మరణించారు.
టిబెట్‌లో భూకంపం
ఇటివలే జనవరి 7న టిబెట్‌లో భూకంపం సంభవించి సుమారు 126 మంది మృతిచెందారు. ఈ భూకంపం కారణంగా టిబెట్‌లో వందలాది మంది ఇళ్లు కూలిపోయాయి. 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ భూకంపం ఎక్కువగా టింగ్రి కౌంటీలో కనిపించింది. దీనితో భారత్, నేపాల్, భూటాన్‌లో భూమి కంపించింది.
టాపిక్