Helicopter crash : నదిలోకి దూసుకెళ్లిన హెలికాప్టర్​- ప్రముఖ కంపెనీ సీఈఓ కుటుంబం దుర్మరణం!-6 dead as helicopter crashes into hudson river in new york search on for others ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Helicopter Crash : నదిలోకి దూసుకెళ్లిన హెలికాప్టర్​- ప్రముఖ కంపెనీ సీఈఓ కుటుంబం దుర్మరణం!

Helicopter crash : నదిలోకి దూసుకెళ్లిన హెలికాప్టర్​- ప్రముఖ కంపెనీ సీఈఓ కుటుంబం దుర్మరణం!

Sharath Chitturi HT Telugu

New York helicopter crash today : న్యూయార్క్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ హెలికాప్టర్​ హడ్సన్​ నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరింకొందరు గాయపడ్డారు.

హడ్సన్​ నదిలో కూలిన హెలికాప్టర్​ (X)

అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్​లోని హడ్సన్​ నదిలో ఒక హెలికాప్టర్​ కూలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో నలుగురిని రక్షించి, న్యూజెర్సీలోని ఆసుపత్రికి తరలించారు.

అమెరికాలో హెలికాప్టర్​ ప్రమాదం..

న్యూయార్క్​లోని వెస్ట్​సైడ్ హైవే, స్ప్రింగ్ స్ట్రీట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మెరైన్, ల్యాండ్ ఎమర్జెన్సీ సర్వీస్ యూనిట్లు వంటి అత్యవసర సేవలను న్యూయార్క్ హెలికాప్టర్ ప్రమాద స్థలానికి పంపించారు.

హడ్సన్ నదిపై గురువారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో స్పెయిన్​లోని సీమెన్స్ అనే కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ అగస్టిన్ ఎస్కోబార్, ఆయన భార్య, వారి ముగ్గురు పిల్లలు మరణించారని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.

ప్రమాదం సమయంలో హెలికాప్టర్​ని నడిపిన పైలట్ ఎవరనే విషయాన్ని మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు.

హడ్సన్ నదిలో హెలికాప్టర్ పాక్షికంగా మునిగిపోయినట్లు, శిథిలాల చుట్టూ అనేక పోలీసు పడవలు ఉన్నట్లు హెలికాప్టర్ ప్రమాద స్థలానికి చెందిన వీడియోలు, ఫోటోలు ఆన్​లైన్​లో చక్కర్లు కొడుతున్నాయి. సమీపంలోని బ్రిడ్జి నుంచి అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి.

హడ్సన్ నదిలో కూలిపోవడానికి ముందు హెలికాప్టర్ కేవలం 15 నిమిషాలు ముందే టేకాఫ్​ అయ్యిందని ఫ్లైట్ రాడార్ తెలిపింది. ఇప్పటికే ఆరుగురు మరణించగా, మరో నలుగురిని బయటకు తీశారు. కాగా, ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా? అని నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు.

న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ నిర్వహిస్తున్న బెల్ 206 హెలికాప్టర్ డౌన్​టౌన్ హెలికాప్టర్ ప్యాడ్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి హడ్సన్ నది మీదుగా ఉత్తరంగా వెళ్లిందని న్యూయార్క్ పోలీసు కమిషనర్ జెస్సికా టిష్ తెలిపారు.

వెస్ట్​సైడ్ హైవే, స్ప్రింగ్ స్ట్రీట్ సమీపంలో హడ్సన్ నదిలో హెలికాప్టర్ కూలిపోవడంతో పరిసర ప్రాంతాల్లో అత్యవసర వాహనాలు తిరుగుతాయని, ట్రాఫిక్ ఆలస్యమవుతుందని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్​మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.

పెరుగుతున్న విమాన ప్రమాదాలు..!

న్యూయార్క్​లో జరిగిన ఈ హెలికాప్టర్​ ప్రమాదం అమెరికాలో చోటు చేసుకున్న అనేక విమానయాన ఘటనల్లో ఒకటి.

అంతకుముందు, వాషింగ్టన్​ డీసీ సమీపంలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్ పోర్టులో కాంగ్రెస్​కు చెందిన ఆరుగురు సభ్యులతో వెళ్తున్న ప్యాసింజర్ జెట్​ను మరో వాణిజ్య విమానం ఢీకొట్టింది.

మాన్​హాటన్​పై ఆకాశం సాధారణంగా విమానాలు, హెలికాప్టర్లు, ప్రైవేట్ వినోద విమానాలు- వాణిజ్య, పర్యాటక విమానాలతో నిండి ఉంటుంది. మాన్​హాటన్​లో అనేక హెలిప్యాడ్లు ఉన్నాయి. ఇవి బిజినెస్​ అఫీషియల్స్​, ఇతరులను మెట్రోపాలిటన్ ప్రాంతం అంతటా గమ్యస్థానాలకు తీసుకువెళతాయి.

2009లో హడ్సన్ నదిపై విమానం, టూరిస్ట్ హెలికాప్టర్ ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందగా, 2018లో ఈస్ట్ నదిలోకి 'ఓపెన్ డోర్' విమానాలను అందించే చార్టర్ హెలికాప్టర్ కూలి ఐదుగురు మృతి చెందడం సహా అనేక ప్రమాదాలు జరిగాయి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.