మెసిడోనియా నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 51 మంది మృతి, 100 మందికి గాయాలు
ఆగ్నేయ ఐరోపా ప్రాంతంలో ఉన్న ఉత్తర మెసిడోనియా దేశంలో గల కోకానిలోని "పల్స్" అనే నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం సంభవించి 51 మంది మృతి చెందారు. దేశంలో ప్రసిద్ధి చెందిన హిప్-హాప్ జంట డీఎన్‌కే ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది.
ఆగ్నేయ ఐరోపాలో ఉన్న ఉత్తర మెసిడోనియా దేశంలోని ఒక నైట్‌క్లబ్‌లో సంగీత ప్రదర్శన సమయంలో అగ్నిప్రమాదం సంభవించడంతో కనీసం 51 మంది మరణించారని అసోసియేటెడ్ ప్రెస్ ఆదివారం నివేదించింది.
స్కోప్జేకి 100 కి.మీ తూర్పున ఉన్న కోకాని అనే పట్టణంలోని డిస్కోథెక్‌లో ఈ విషాదకర సంఘటన జరిగింది. ఈ కచేరీకి సుమారు 1,500 మంది ప్రజలు హాజరయ్యారు.
కోకానిలోని "పల్స్" అనే నైట్‌క్లబ్‌లో దేశంలో ప్రసిద్ధి చెందిన హిప్-హాప్ జంట డీఎన్‌కే ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమైన ఈ కచేరీకి ప్రధానంగా యువత హాజరయ్యారు.
అగ్నిప్రమాదం ఉదయం 3 గంటలకు (0200 GMT) ప్రారంభమైందని, 100 మందికి పైగా గాయపడ్డారని ఆన్‌లైన్ మీడియా సంస్థ ఎస్‌డికె స్థానిక యంత్రాంగాన్ని ఉటంకిస్తూ నివేదించింది.
ప్రధాని ప్రకటన
“ఇది మెసిడోనియాకు కష్టకాలం, చాలా విషాదకరమైన రోజు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలు, ప్రియమైనవారు, స్నేహితుల బాధ అపారమైనది,” అని ఉత్తర మెసిడోనియా ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మిక్కోస్కి X (ట్విట్టర్)లో ప్రకటించారు.
“ప్రజలు, ప్రభుత్వం వారి బాధను కొంతవరకు తగ్గించడానికి, ఈ కష్టకాలంలో వారికి సహాయపడటానికి తమ వంతు కృషి చేస్తారు.” అని పేర్కొన్నారు.
గాయపడిన వారిని కోకాని, స్టిప్ పట్టణాల్లోని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. పైరోటెక్నిక్ పరికరాల వాడకం వల్లే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని స్థానిక మీడియా అనుమానించింది.
సంబంధిత కథనం