జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో మే 8న 45 నుండి 50 మంది ఉగ్రవాదులు పెద్ద ఎత్తున చొరబాటు ప్రయత్నం చేశారని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పాకిస్తాన్ షెల్లింగ్ (భారీ కాల్పుల) కవర్‌లో ఈ ప్రయత్నం జరిగిందని సమాచారం.
పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఉగ్రవాదులు అంతర్జాతీయ సరిహద్దు దాటడానికి భారీ కాల్పులను ఉపయోగించిందని బీఎస్‌ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజి) ఎస్.ఎస్. మండ్ చెప్పారు. "మా ధైర్యవంతులైన సైనికులు వారికి భారీ నష్టాలను కలిగించారు. పెద్ద సమూహం చొరబడటానికి ప్రయత్నిస్తున్నట్లు మాకు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. మేము వారికి సిద్ధంగా ఉన్నాg. మరియు మే 8న వారిని గుర్తించాము" అని డిఐజి మండ్ వార్తా సంస్థ ఏఎన్‌ఐ (ANI) కి తెలిపారు.
"వారు 45-50 మంది సమూహం. వారు మా స్థానం వైపు వస్తున్నారు. మేం పరిస్థితిని అంచనా వేసి, వారిపై భారీ బాంబు దాడి చేశాం" అని ఆయన తెలిపారు.
ఈ సంఘటనను వివరిస్తూ, "మేము ఊహించినట్లుగానే, వారు తమ పోస్టుల నుండి భారీ కాల్పులతో ప్రతిస్పందించారు. మేం వారిపై కాల్పులు జరిపాం. వారు తమ పోస్టుల నుండి పారిపోవడం కనిపించింది. మేం వారిని ఒకటిన్నర గంటల్లో తరిమికొట్టాం.." అని తెలిపారు.
బీఎస్‌ఎఫ్ అధికారులు ముందు శ్రేణి స్థానాల్లో ఉన్నారని, ఇది సైనికులలో అధిక ధైర్యాన్ని నిలబెట్టడానికి సహాయపడిందని ఆయన అన్నారు. మహిళా సైనికుల అంకితభావాన్ని కూడా ఆయన ప్రశంసించారు. "మేం వారి బంకర్లను ధ్వంసం చేశాం. వారి కాల్పుల సామర్థ్యాన్ని తగ్గించాం. మా జవాన్లు ఇంకా చాలా ఉత్సాహంగా ఉన్నారు. శత్రువు మళ్ళీ ఏదైనా చర్య తీసుకుంటే, మేం పది రెట్లు ఎక్కువ బలంతో ప్రతిస్పందిస్తాం. బీఎస్‌ఎఫ్ కు ఈ స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి" అని మండ్ తెలిపారు.
మహిళా సైనికుల గురించి మాట్లాడుతూ, "మా మహిళా సైనికులు తమ పురుష సహోద్యోగులతో భుజం భుజం కలిపి నిలబడి, అన్ని విధులను సమర్థవంతంగా నిర్వహించారు. మేం నిజంగా గర్విస్తున్నాము" అని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం పూంచ్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆయన ఆ ప్రాంతంలో మోహరించిన ఆర్మీ, బీఎస్‌ఎఫ్ సిబ్బందిని కలిశారు.
బీఎస్‌ఎఫ్ పంజాబ్ సరిహద్దు వెంబడి మూడు జాయింట్ చెక్ పోస్టులైన అటారీ-వాఘా, హుస్సైనివాలా, సద్కీ వద్ద 'బీటింగ్ రిట్రీట్' వేడుకను తిరిగి ప్రారంభించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత మే 9న రోజువారీ జెండా వేడుకను నిలిపివేశారు. ఇప్పుడు ఇది ప్రజల సందర్శన కోసం తిరిగి తెరుచుకుంది.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తైబా, మరియు హిజ్బుల్ ముజాహిదీన్ వంటి గ్రూపులకు చెందిన 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చడానికి భారత బలగాలు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి.
భారతదేశ దాడుల తర్వాత, పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలలో షెల్లింగ్, అలాగే డ్రోన్ దాడులతో ప్రతిస్పందించింది. భారతదేశం పాకిస్తాన్ యొక్క వైమానిక రక్షణ, రాడార్, మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీయడం ద్వారా దీన్ని ఎదుర్కొంది.
మే 10న సైనిక చర్యలను నిలిపివేయడానికి కాల్పుల విరమణ అవగాహన కుదిరింది.