Delhi crime news : దిల్లీ మదరసాలో దారుణం- సెలవు వస్తుందని 5ఏళ్ల బాలుడి హత్య!
Delhi crime news : మదరసాలో ఉండే ముగ్గురు విద్యార్థులు, మరో 5ఏళ్ల బాలుడిని చంపేశారు! ఎవరైనా చనిపోతే సెలవు లభిస్తుందని, ఇంటికి వెళ్లొచ్చన్న ఉద్దేశంతో వారు హత్యకు పాల్పడ్డారు!
దిల్లీలోని ఓ మదరసాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 9 నుంచి 11ఏళ్ల వయస్సు ఉన్న ముగ్గురు విద్యార్థులు, ఓ 5ఏళ్ల బాలుడిని చంపేశారు! ఎవరైనా చనిపోతే, ప్రిన్సిపాల్ సెలువు ఇస్తాడని, ఇంటికి వెళ్లొచ్చన్న ఉద్దేశంతో వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
ఇదీ జరిగింది..
దిల్లీలోని దయాల్పూర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగింది ఈ ఘటన. ముగ్గురు విద్యార్థులను ఆ 5ఏళ్ల బాలుడు తిట్టాడు. అది వారికి నచ్చలేదు. పైగా వారికి ఇంటికి వెళ్లాలని చాలా రోజుల నుంచి అనిపిస్తోంది. బాలుడు చనిపోతే ప్రిన్సిపాల్ సెలవు ఇస్తాడని, ఇంటికి వెళ్లొచ్చని వారు భావించారు. ఈ క్రమంలోనే బాలుడి మీద ముగ్గురు కలిసి దాడి చేశారు. ఆ 5ఏళ్ల బాలుడు మరణించాడు.
బాలుడి మరణ వార్తను ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కానీ బాలుడు ఆరోగ్య సమస్యలతో మరణించాడని చెప్పాడు. బాలుడిని ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. ఆరోగ్య సమస్యలతో కాదు, ఎవరో దాడి చేయడంతో బాలుడు మరణించాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. బాలుడి శరీరానికి గాయాలైనట్టు, లివర్ దెబ్బతినట్టు, ఊపిరితిత్తుల్లో రక్తస్రావమై చనిపోయినట్టు రిపోర్టు స్పష్టం చేసింది.
పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మదరసాకు వెళ్లారు. స్థానిక సీసీటీవీ పుటేజ్ని పరిశీలించారు. ఆ బాలుడిపై మరో ముగ్గురు దాడి చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వెంటనే ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విచారణలో భాగంగా ముగ్గురు నిందితులు నిజం చెప్పారు. బాలుడు చనిపోతే సెలవు లభిస్తుందన్న ఉద్దేశంతోనే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు.
బాలుడి మరణంతో అతని తల్లి దిగ్భ్రాంతికి గురైంది. పనిమనిషిగా పనిచేస్తున్న ఆ మహిళ తన 5ఏళ్ల బిడ్డను 5 నెలల క్రితం మదరసాలో చేర్పించింది. ఆమె పంజాబ్లో పనిచేస్తుండగా, భర్త ఉత్తర్ ప్రదేశ్లో ఉన్నాడు.
"5 నెలల క్రితం 5ఏళ్ల బాలుడిని అతని తల్లి మదరసాకు పంపించింది. శుక్రవారం రాత్రి ఆమెకు ఫోన్ వెళ్లింది. బిడ్డ ఆరోగ్యం బాలేదని చెప్పారు. పిల్లాడిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అతను అప్పటికే మరణించాడు," అని డీసీపీ తెలిపారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలుడి హత్యలో ఇంకెవరి పాత్రైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత మదరసాలో 250మంది బాలురు ఉన్నారు. వీరిలో 150మంది యూపీ నుంచి వచ్చిన వారు ఉన్నారు. మరోవైపు బాలుడి హత్య వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. కుటుంబసభ్యులు, స్థానికులు నిరసన చేపట్టారు. ప్రిన్సిపాల్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటన తర్వాత కొందరు తల్లిదండ్రులు మదరసాలోని తమ బిడ్డలను వెనక్కి తీసుకెళ్లిపోయారు.
సంబంధిత కథనం