Crime news: 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, హతమార్చిన ఐదుగురికి మరణ శిక్ష
Crime news: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హతమార్చిన ఐదుగురికి కోర్టు మరణ శిక్ష విధించింది. హత్యాచారం చేసేముందు, ఆ రాక్షసులు ఆ బాలిక కుటుంబానికి చెందిన మరో ఇద్దరిని కూడా హత్య చేశారు. తీర్పు వెలువరిస్తూ, అదనపు సెషన్స్ జడ్జి మమతా భోజ్వానీ ‘‘ఈ నేరం "చాలా వికృతమైనది, హేయమైనది’’ అని వ్యాఖ్యానించారు.
Crime news: 16 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఐదుగురికి ఛత్తీస్ గఢ్ లోని కోర్బా ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. ఆరో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దోషులు అత్యంత అమానవీయంగా, క్రూరంగా ఈ నేరానికి పాల్పడ్డారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘ఈ చర్య అత్యంత వికృతమైన, హేయమైన, క్రూరమైన, పిరికిపంద చర్య’ అని పేర్కొన్నారు.

ఆరుగురు దోషులు
ఈ హేయమైన నేరానికి పాల్పడిన సంత్రామ్ మాంజ్వార్ (49), అబ్దుల్ జబ్బార్ (34), అనిల్ కుమార్ సారథి (24), పరదేశి రామ్ (39), ఆనంద్ రామ్ పానికా (29)లకు న్యాయమూర్తి మమతా భోజ్వానీ మరణశిక్ష విధించారు. ఆరో దోషి ఉమాశంకర్ యాదవ్ (26)కు జీవిత ఖైదు విధించినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీల్ కుమార్ మిశ్రా తెలిపారు. ఆరుగురు నిందితులకు మరణశిక్ష విధించాలని తాను కోరానని, అయితే యాదవ్ కు వైద్య కారణాల రీత్యా యావజ్జీవ కారాగార శిక్ష విధించారని మిశ్రా చెప్పారు. ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 376 (2)జి, ఇతర సెక్షన్లు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (pocso) చట్టం కింద వీరిని దోషులుగా నిర్ధారించారు.
కేసు వివరాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పటికే వివాహమైన ప్రధాన నిందితుడు మంజ్వార్.. బాధిత గిరిజన బాలికను తనకు రెండో భార్యగా రావాలని ఒత్తిడి తెస్తున్నాడు. అయితే అందుకు ఆ బాలిక కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ అంగీకరించలేదు. దాంతో మంజ్వార్ మొదట ఆ బాలిక తండ్రిని, వారి వద్దే ఉంటున్న నాలుగేళ్ల చిన్నారిని హతమార్చారు. అనంతరం, ఆ 16 ఏళ్ల బలికను సమీపంలోని అడవిలోకి తీసుకువెళ్లి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం, ఆమెపై భారీ బండరాళ్లు వేసి చంపేశారు. ఛత్తీస్ గఢ్, కోర్బా జిల్లాలోని లెమ్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని గదుప్రోడా గ్రామ సమీపంలో ఈ నేరం జరిగింది. బాధితులు పహాడీ కోర్వా గిరిజన సామాజిక వర్గానికి చెందినవారు.