UP crime news : ఆ ఇంట్లో ఐదు మృతదేహాలు- హత్య? ఆత్మహత్య?-5 of family found dead in ups meerut bodies of 3 kids recovered from bed box ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Up Crime News : ఆ ఇంట్లో ఐదు మృతదేహాలు- హత్య? ఆత్మహత్య?

UP crime news : ఆ ఇంట్లో ఐదు మృతదేహాలు- హత్య? ఆత్మహత్య?

Sharath Chitturi HT Telugu
Jan 10, 2025 10:59 AM IST

UP crime news : యూపీ మీరట్​లోని ఓ ఇంట్లో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ముగ్గురి మృతదేహలు బెడ్​ బాక్స్​లో కనిపించాయి. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది.

ఘటనాస్థలంలో పోలీసులు..
ఘటనాస్థలంలో పోలీసులు.. (PTI)

ఉత్తర్​ప్రదేశ్​లో విషాదకర ఘటన చోటుచేసుకుంది! మీరట్​లోని ఓ ఇంట్లో, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతదేహాలు లభించాయి. ముగ్గురు చిన్నారుల మృతదేహాలు బెడ్​ బాక్స్​లో కనిపించాయి.

yearly horoscope entry point

ఇదీ జరిగింది..

మీరట్​లోని లిసాడీ గేట్ పోలీస్​స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మీరట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) విపిన్ తడా ప్రకారం.. స్థానికులు ఇచ్చిన అలర్ట్​కి స్పందించిన అధికారులు.. ఘటనాస్థలానికి వెళ్లారు. మొయిన్, అతని భార్య అస్మా, వారి ముగ్గురు కుమార్తెలు అఫ్సా (8), అజీజా (4), ఆదిబా (1) మృతదేహాలు వారికి కనిపించాయి.

ఇంటికి తాళం వేసిన తీరును బట్టి ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి కుటుంబానికి తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

పాత కక్షలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఎస్పీ తెలిపారు. బాధితుల్లో ఒకరి కాళ్లను బెడ్​షీట్​తో కట్టేశారని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ బృందం, సీనియర్ అధికారులు ఘటనాస్థలం నుంచి ఆధారాలు సేకరించారు.

బెడ్ బాక్స్ లోపల మృతదేహాలు..

మెకానిక్​గా పనిచేస్తున్న మొయిన్, అతని భార్య అస్మా బుధవారం నుంచి కనిపించకుండా పోయారు. మొయిన్ సోదరుడు సలీం ఈ భయానక దృశ్యాన్ని మొదట చూశాడు.

తన సోదరుడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడని ఆందోళన చెందిన సలీం తన భార్యతో కలిసి మొయిన్ ఇంటికి వెళ్లాడు. తలుపు తెరిచేందుకు పదేపదే చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇరుగుపొరుగు వారి సహాయం తీసుకుని బలవంతంగా లోపలికి ప్రవేశించారు.

లోపల మోయిన్, అస్మా మృతదేహాలు నేలపై ఉండగా, పిల్లల మృతదేహాలను బెడ్ బాక్స్​లో దాచిపెట్టారు.

ఆ కుటుంబం ఇటీవలే ఆ ప్రాంతానికి వెళ్లిందని, మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు వారి నేపథ్యాన్ని పరిశీలిస్తున్నారని ఎస్ఎస్పీ తెలిపారు.

ఈ తరహా ఘటనాలు..

గత ఏడాది సెప్టెంబర్​లో నైరుతి దిల్లీ రంగ్​పురిలోని ఓ అపార్ట్​మెంట్​లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 8 నుంచి 18 ఏళ్ల వయసున్న దివ్యాంగ కుమార్తెలు, తమ తండ్రితో కలిసి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానించారు.

ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు అధికారులకు సమాచారం అందించారు. తండ్రి కూతుళ్లకు విషం ఇచ్చి ఉంటాడని పోలీసులు భావించారు. కొన్నేళ్ల క్రితం తల్లి కేన్సర్​తో చనిపోవడంతో కుటుంబం ఇబ్బందులను ఎదుర్కొంది.కార్పెంటర్ అయిన తండ్రి తన పిల్లలను మాత్రమే చూసుకుంటున్నాడు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.

డిసెంబర్​లో హరియాణా కురుక్షేత్రలోని యారా గ్రామంలో ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను, భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు.

తండ్రి గొంతు కోసిన కుమారుడు.. దిండుతో తల్లిని ఊపిరాడనివ్వకుండా చేశాడు. అనంతరం భార్యకు విషం ఇచ్చి చంపేశాడు. ఆ వ్యక్తి తన 13 ఏళ్ల కుమారుడిని గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు, కానీ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. డిసెంబర్​ 9న ఉదయం ఇంటి నుంచి కుటుంబ సభ్యులు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడని, ఇదే ఈ దారుణానికి దారితీసి ఉండొచ్చని విచారణలో తేలింది. కుటుంబంలో ఎలాంటి శత్రుత్వం, మనస్పర్థలు లేవని బంధువులు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.