Pigeon Theft : రూ.10 లక్షల విలువ చేసే 400 పావురాలు ఎత్తుకెళ్లిన దొంగలు.. పక్కింటిలో నుంచి ఇలా వచ్చి..!
Meerut Pigeon Theft : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి ఇంట్లో సుమారు 400 పావురాలను ఎత్తుకెళ్లారు దొంగలు. వీటి విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని బాధితుడు చెబుతున్నాడు.

దొంగలు ఇంట్లో నుంచి కొన్ని విలువైన వస్తువులను దొంగిలిస్తారని తెలుసు. కానీ మీరట్‌లో దొంగలు ఒక ఇంటి పైకప్పు నుండి 400 పావురాలను దొంగిలించారు. ఈ పావురాల ధర రూ. 10 లక్షలకు పైగా ఉంటుందని బాధితుడు చెబుతున్నాడు. లక్షల రూపాయల విలువైన పావురాలను దొంగిలించిన ప్రత్యేకమైన కేసుపై ఆసక్తి నెలకొంది. పావురాల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దొంగల కోసం వెతుకుతున్నారు.
మీరట్‌లో లిసారి గేట్ నివాసి హాజీ ఖయ్యూమ్. 20 సంవత్సరాలుగా పావురాలను పెంచే వ్యాపారంలో ఉన్నాడు. నిన్న రాత్రి దొంగలు పక్కింటిలో నిర్మాణ సామాగ్రిని ఉపయోగించి ఖయ్యూమ్ ఇంటి పైకప్పులోకి ప్రవేశించగలిగారు. వాటిని తాత్కాలిక నిచ్చెనగా మార్చారు. అప్పటికప్పుడు నిచ్చెన తయారు చేసి ఖయ్యూమ్ ఇంటి పైకప్పుపైకి చేరుకున్నారు. వాళ్ళు అక్కడ ఉంచిన పావురాలన్నింటినీ దొంగిలించారు. సోమవారం ఉదయం ఖయ్యూమ్ తన పావురాలకు ఆహారం పెట్టడానికి టెర్రస్ పైకి వెళ్లాడు. ఒక్క పావురం కూడా కనిపించలేదు.
పావురాల దొంగతనం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు బాధితుడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఖయ్యూమ్ ప్రకారం, ఇందులో విదేశీ జాతి పావురాలు కూడా ఉన్నాయి. పావురాల ధర రూ.10 లక్షలకు పైగా ఉంటుంది. ఒక్కో పావురం ధర రూ.25 వేల నుంచి రూ.50 వేలు మధ్య ఉంటుంది.
ఈ కేసు గురించి మీరట్ సిటీ ఎస్పీ ఆయుష్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. హాజీ ఖయ్యూమ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అతని దగ్గర దాదాపు 400 పావురాలు ఉన్నాయి. వాటిని ఎవరో దొంగిలించారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిందితులను పట్టుకోవడంపై దృష్టి పెట్టడానికి బదులుగా తన కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారని ఖయ్యూమ్ పేర్కొన్నాడు. పావురాలను ఉంచిన ఖాళీ బోనులను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పావురాల దొంగతనం కేసుపై ఆసక్తి నెలకొంది.
సంబంధిత కథనం