Tornadoes in US : టోర్నడోలకు 30కిపైగా మంది బలి- అల్లకల్లోలంగా టెక్సాస్, మిస్సోరి..
US Tornado 2025 : అమెరికాలో టోర్నడోల కారణంగా 20 రాష్ట్రాలు ప్రభావితమయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఇప్పటివరకు 32మంది మరణించారు.
అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో టోర్నడోలు అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. భయానకంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టోర్నోడో ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం నుంచి ఇప్పటివరకు 32మంది మరణించారు.
ఈ రాష్ట్రాల్లో టోర్నడల బీభత్సం..
టోర్నడోల కారణంగా అమెరికావ్యాప్తంగా మొత్తం మీద 20 రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. మిస్సోరి, అర్కాన్సాస్, టెక్సాస్, ఓక్లహోమా రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మిస్సోరీలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. ఈ ఒక్క రాష్ట్రంలో 12 మంది మరణించారు! కాన్సాస్‌లో శుక్రవారం హైవేపై 50కి పైగా వాహనాలు ఢీకొనడంతో ఎనిమిది మంది మృతి చెందారు.
టోర్నడోల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు కొట్టుకుపోయాయి.
"అది ఇల్లుగా కనిపించడం లేదు. కేవలం శిథిలాలు మాత్రమే ఉన్నాయి. నేల తలకిందులైంది. మేము గోడలపై నడుస్తున్నాము," అని బట్లర్ కౌంటీకి చెందిన కరోనర్ జిమ్ అకర్స్ చెప్పారు.
శనివారం అర్థరాత్రి నుంచి వాతావరణం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉండటంతో అర్కాన్సాస్, జార్జియా గవర్నర్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు అర్కాన్సాస్ గవర్నర్ సారా హుకాబీ డిజాస్టర్ రికవరీ ఫండ్‌గా 2,50,000 డాలర్లను విడుదల చేశారు.
టోర్నడోల మధ్య ఓక్లహోమాలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. తన రాష్ట్రంలో 689 చదరపు కిలోమీటర్ల భూమి కాలిపోయిందని, గాలుల కారణంగా మంటలు పెరుగుతున్నట్టు, 300 ఇళ్లు దెబ్బతిన్ననట్టు గవర్నర్ కెవిన్ స్టిట్ పేర్కొన్నారు.
టోర్నడోల నేపథ్యంలో ప్రమాదకర పరిస్థితులు, ప్రాణాంతక పరిస్థితులు ఎదుర్కొంటుంటే వెంటనే 911కి ఫోన్ చేయాలని అధికారులు చెబుతున్నారు.
టోర్నడోలతో పాటు, టేనస్సీ, కంబర్లాండ్, ఒహియో నదీ లోయలు వంటి ప్రాంతాలకు ఆకస్మిక వరదల ముప్పు సైతం పొంచి ఉంది. భారీ వర్షం, తక్కువ దృశ్యమానత వల్ల టోర్నడోలను గుర్తించడం కష్టతరం అవుతుందని అధికారులు చెబుతున్నారు.
విపరీతమైన వాతావరణ పరిస్థితులు..
దేశవ్యాప్తంగా టోర్నడోల కారణంగా ఏర్పడిన విపరీత వాతావరణ పరిస్థితులు యూఎస్ అంతటా 100 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేయనున్నాయి. ప్రాణాంతక గాలులు టోర్నడోలు, ధూళి తుపానులకు కారణమయ్యాయి. అనేక చోట్ల కార్చిచ్చులు కూడా పుట్టుకొచ్చాయి.
“హ్యూరికెన్ స్పీడ్ (100ఎంపీహెచ్) దాటితే ఈ తుపానులు మరింత ప్రాణాంతకంగా ఉంటాయి. బేస్బాల్స్ అంత పెద్దగా టోర్నడోలు ఉంటాయి,” అని అమెరికన్ స్టార్మ్ ప్రెడిక్షన్ సెంటర్ వెల్లడించింది.
తూర్పు లూసియానా, మిసిసిపీ నుంచి అలబామా, పశ్చిమ జార్జియా, ఫ్లోరిడా దీవుల్లో టోర్నడోల ముప్పు ఎక్కువగా ఉంది. మరోవైపు టెక్సాస్, కాన్సాస్, మిస్సోరి, న్యూ మెక్సికోలో కార్చిచ్చు చెలరేగే అవకాశం ఉంది.
బలమైన గాలుల కారణంగా టెక్సాస్, ఓక్లహోమా, మిస్సోరి, ఇల్లినాయిస్, ఇండియానా, మిచిగాన్లలో 2,00,000 ఇళ్లు, వ్యాపారాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని poweroutage.us తెలిపింది.
మంచు తుపాను కూడా..!
మరోవైపు పశ్చిమ మిన్నెసోటా, తూర్పు దక్షిణ డకోటాలోని కొన్ని ప్రాంతాలకు మంచు తుపాను హెచ్చరికలు జారీ చేసింది నేషనల్ వెదర్ సర్వీస్. ఈ ప్రాంతాల్లో 6 అంగుళాల వరకు మంచు పేరుకుపోతుందని, గంటకు 60 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
సంబంధిత కథనం