బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. మృతుల్లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన 13 ఏళ్ల బాలిక కూడా ఉండగా, 17, 19 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు ఉన్నారు. అహ్మదాబాద్ లో 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంగళవారం ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అనంతరం, ఆర్సీబీ టీమ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించింది. ఈ కార్యక్రమానికి అనూహ్యంగా లక్షలాది మంది అభిమానులు తరలిరావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది.
నిర్వహణ లోపాలు, అనూహ్యంగా భారీగా ప్రజలు తరలిరావడం వల్లనే ఈ దారుణం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల్లో 13 సంవత్సరాల బాలిక కూడా ఉంది. మొత్తంగా మృతులంతా 40 ఏళ్ల లోపు వయస్సున్న యువకులే. మృతుల జాబితాలో దివ్యాన్షి (13) దొరేషా (32) భూమిక్ (20) సహనా (25) అక్షత (27) మనోజ్ (33) శ్రవణ్ (20) దేవి (29) శివలింగ (17) చిన్మయి (19) ప్రజ్వల్ (20) ఉన్నారు.
మృతుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన దివ్యాన్షి అనే యువతి కూడా ఉంది. బెంగళూరులోని యలహంకలో కుటుంబంతో కలిసి నివసిస్తున్న కర్నాటకలోని యాద్గిర్ జిల్లాకు చెందిన శివ లింగ స్వామి కూడా ఈ తొక్కిసలాటలో చనిపోయాడు.
అసెంబ్లీ కాంప్లెక్స్ వద్ద వీఐపీలు ఉండటంతో అక్కడ భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. స్టేడియంలో రద్దీ సామర్థ్యానికి మించి ఉంది. ఇక్కడ అవసరమైన స్థాయిలో భద్రతా సిబ్బందిని సిద్ధం చేయలేదు. చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35 వేలు కాగా, అభిమానుల సంఖ్య 3 లక్షలు దాటిందని సమాచారం. అభిమానుల సంఖ్యతో పోలిస్తే భద్రతా సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉంది.
భద్రతాపరమైన సవాళ్లను కారణంగా చూపి బెంగళూరు పోలీసులు విక్టరీ పరేడ్ కు అనుమతి నిరాకరించారని మరో నివేదిక పేర్కొంది. అయితే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం, జట్టు నిర్వాహకులు సంబరాలను కొనసాగించారు. మధ్యాహ్నం 3.14 గంటలకు 'ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్' ప్రాతిపదికన ఆర్సీబీ విక్టరీ పరేడ్ నిర్వహించి ఉచిత పాసులు ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు స్టేడియానికి తరలివచ్చారు. ప్రజలు గేట్లు ఎక్కి, బారికేడ్లను తోసేయడం, కొందరు చెట్లు కూడా ఎక్కిన దృశ్యాలు ఉన్నాయి. జనాన్ని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది నానా తంటాలు పడ్డారు. ముఖ్యంగా స్టేడియం గేట్ల వద్ద తొక్కిసలాట జరిగింది.
సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం, క్షతగాత్రులకు ఉచిత వైద్యం ప్రకటిస్తూ కుంభమేళాను ఉదాహరణగా పేర్కొన్నారు. ‘‘ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరిగాయి. ఇప్పుడు వారితో పోల్చి, అది అక్కడక్కడా జరిగిందని చెప్పి నేను సమర్థించుకోను. కుంభమేళాలో 50-60 మంది చనిపోయారు, కానీ నేను విమర్శించలేదు. కాంగ్రెస్ విమర్శిస్తే అది వేరే విషయం. నేను గానీ, కర్ణాటక ప్రభుత్వం గానీ విమర్శించామా’’ అని ప్రశ్నించారు.
సంబంధిత కథనం