Rain Havoc: భారీ వర్షాలతో నీట మునిగిన బిల్డింగ్ బేస్ మెంట్; ముగ్గురు మృతి
పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రాజస్తాన్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్ర రాజధానిలో బిల్లింగ్ బేస్ మెంట్ లో నీటిలో చిక్కుకుపోయి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జైపూర్ ఏర్ పోర్ట్ ఎంట్రెన్స్ కూడా భారీ వర్షాల కారణంగా జలమయమైంది.
రాజస్తాన్ లో కురిసిన భారీ వర్షాలకు జైపూర్లోని ఓ నివాస భవనం లోని బేస్ మెంట్ నీటిలో మునిగింది. అందులో నీటిలో చిక్కుకుని ముగ్గురు మృతి చెందారు. జైపూర్ లోని విశ్వకర్మ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ బేస్ మెంట్ నీట మునిగి నలుగురు గల్లంతయ్యారు.
12 అడుగుల మేర నీరు..
రాజస్తాన్ (RAJASTHAN) లో కురిసిన భారీ వర్షాలకు జైపూర్లోని విశ్వకర్మ ప్రాంతంలోని ఒక భవనం బేస్ మెంట్ లో 12 అడుగుల మేర నీరు చేరడంతో సుమారు 13 మంది ఆ బేస్ మెంట్ లో చిక్కుకుపోయారు. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో, ఘటనాస్థలానికి హుటాహుటిన ఎస్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. వారు బేస్ మెంట్ లో చిక్కుకుపోయిన వారిలో తొమ్మిది మందిని రక్షించారు. మిగతావారు గల్లంతయ్యారని చోము పట్టణ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ చౌహాన్ తెలిపారు. అయితే 8 గంటల సుదీర్ఘ గాలింపు అనంతరం ఎస్డీఆర్ఎఫ్ బృందం ముగ్గురి మృతదేహాలను గుర్తించగా, మరొకరిని సురక్షితంగా రక్షించారు.
జైపూర్ ఏర్ పోర్ట్ కూడా..
సికార్, అజ్మీర్ వంటి ప్రధాన రహదారులతో పాటు జైపూర్ విమానాశ్రయ ప్రవేశ ద్వారం కూడా జలమయమైంది. దాంతో, విమానాశ్రయ రాకపోకలకు అంతరాయం కలిగింది. బగ్రూ ప్రాంతంలో మురుగు కాలువ పొంగిపొర్లడంతో కొట్టుకుపోయిన మరో బాలుడి కోసం ఎస్డీఆర్ఎఫ్ గాలిస్తోంది. భారీ వర్షాల కారణంగా జైపూర్ లోని కొన్ని పాఠశాలలు కూడా మూతపడ్డాయి.
కోటలో బస్సు బోల్తా కోట
మరోవైపు, రాజస్తాన్ లోని కోటలో 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కూడా లోయలో బోల్తా పడింది. ముకుంద టైగర్ హిల్స్ సమీపంలోని ఎన్ హెచ్ -35 వద్ద ట్రాఫిక్ ను నివారించడానికి డ్రైవర్ ఇరుకైన మార్గంలో వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయిందని, నలుగురికి గాయాలయ్యాయని మోదక్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. చురులో గురువారం తెల్లవారుజామున 100 ఏళ్ల నాటి భవనం కూలిపోగా, జిలేబీ చౌక్ లోని హైవేలో కొంత భాగం కూలిపోయింది. అయితే ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
వర్షం ముప్పు
జైపూర్, దౌసా, నాగౌర్, కోటా, బుండి, ఝలావర్, భరత్పూర్, సికార్, టోంక్, చురు సహా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) గురువారం ఉదయం అంచనా వేసింది. ఉదయం 10 గంటల వరకు జైపూర్ లో అత్యధికంగా 173 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఎయిర్ పోర్టు ప్రాంతంలో అత్యధికంగా 133 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.