Ayodhya Deepotsav: అయోధ్యలో దీపావళి సందర్భంగా 24 లక్షల ప్రమిదలతో దీపోత్సవం
Ayodhya Deepotsav: అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. యూపీ ప్రభుత్వం ఈ దీపావళి సందర్భంగా 24 లక్షల మట్టి దీపాలతో అయోధ్యలో దీపోత్సవం నిర్వహించనుంది.
Ayodhya Deepotsav: ఈ దీపావళికి అయోధ్యలో మరో గిన్నిస్ రికార్డు నమోదు కానుంది. దీపావళి రోజు అయోధ్యలో సరయు నదీతీరంలో మొత్తం 24 లక్షల మట్టి దీపాలను వెలిగించి, ఘనంగా దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ దీపాలను ఒకే సమయంలో వెలిగించడం కోసం వేల సంఖ్యలో వలంటీర్లు అయోధ్య చేరుకుంటున్నారు. వీరిలో అవధ్ యూనివర్సిటీ నుంచి వెళ్తున్న 25 వేల మంది విద్యార్థులు కూడా ఉన్నారు.
గిన్నిస్ రికార్డు..
గత సంవత్సరం అయోధ్యలో అత్యధిక దీపాలను వెలిగించి నమోదు చేసిన రికార్డును ఈ సంవత్సరం బద్ధలు కొట్టనున్నారు. ఈ రికార్డును నమోదు చేయడం కోసం గిన్నిస్ బుక్ ప్రతినిధులు కూడా దీపావళి రోజు అయోధ్యకు చేరుకోనున్నారు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి..
అయోధ్యలో ఈ దీపోత్సవంతో పాటు దీపావళి వేడుకలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యోగి ఆదిత్య నాథ్ ఈ వేడుకల్లో స్వయంగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్య నాథ్, అతడి మొత్తం కేబినెట్ సహచరులతో పాటు 50 కి పైగా దేశాల హై కమిషనర్లు, రాయబారులు కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న దీపోత్సవంలో సరయు నదీ తీరంలోని ఘాట్లపై ఈ 24 లక్షల మట్టి ప్రమిదలను వెలిగిస్తారు.
చెప్పులు లేకుండా అయోధ్యకు..
ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని ఆసుపత్రులను అప్రమత్తంగా ఉంచామని డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ తెలిపారు. "దీపోత్సవ్‌లో ఈ సారి కొత్త రికార్డు సృష్టించబోతున్నాం. ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి 50కి పైగా దేశాల రాయబారులు హాజరవుతున్నారు" అని ఆయన చెప్పారు. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి జార్ఖండ్ కు చెందిన దాదాపు 48 మంది గిరిజనులు చెప్పులు లేకుండా అయోధ్యకు చేరుకున్నారు.