Suicide attack in Pak police station: పాక్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి; 24 మంది దుర్మరణం
Suicide attack in Pakistan: వాయువ్య పాకిస్తాన్లోని ఒక పోలీస్ స్టేషన్ పై మంగళవారం తెల్లవారు జామున ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.

Suicide attack in Pakistan: వాయువ్య పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ పట్టణం అఫ్ఘానిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉంటుంది.
వాహనం పేల్చేసి..
మంగళవారం తెల్లవారు జామున ఉగ్రవాదులు పేలుడు పదార్దాలతో నిండిన వాహనంతో పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి, అక్కడ ఆ వాహనాన్ని పేల్చేశారు. అనంతరం, పోలీస్ స్టేషన్ లోని సిబ్బందిపై కాల్పులు ప్రారంభించారు. ఈ ఆత్మాహుతి దాడిలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో చాలా మంది సివిల్ డ్రెస్ లో ఉండడంతో వారు ఎవరనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. వారు పాకిస్తాన్ మిలటరీ సిబ్బంది అని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడిలో పోలీస్ స్టేషన్ భవనం పూర్తిగా ధ్వంసమైంది.
ఉగ్రవాదుల హతం..
దాడి అనంతరం పోలీస్ స్టేషన్ లోని సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. అయితే, వెంటనే తేరుకున్న పోలీసులు వారిపై ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్ కౌంటర్ కొన్ని గంటల పాటు కొనసాగింది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొందరు తప్పించుకుని పారిపోయారు. వారికోసం పోలీసులు సమీప ప్రాంతాల్లో గాలింపు ప్రారంభించారు.
ఉగ్రవాదుల కంచుకోట..
ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ పట్టణం ఉగ్రవాదులకు కంచుకోటగా కొనసాగుతోంది. ఇది అఫ్గానిస్తాన్ కు సమీపంలో ఉండడం వారికి కలిసి వస్తోంది. గతంలో ఇక్కడ ఉగ్రవాద సంస్థ ‘‘తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ (TTP)’’ బలంగా ఉండేది. ఇటీవల ఇక్కడ ‘‘తెహ్రీక్ ఇ జహీద్ పాకిస్తాన్ (Tehreek-e-Jihad Pakistan TJP)’’ పేరుతో మరో ఉగ్రవాద సంస్థ ప్రారంభమైంది. ఈ రోజు పోలీస్ స్టేషన్ పై దాడి చేసింది తామేనని ఈ టీజేపీ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆ పోలీస్ స్టేషన్ లోని అధికారులు లక్ష్యంగా ఈ దాడి చేశామని ప్రకటించింది. ఈ జనవరి నెలలో ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లోని ఒక మసీదులో జరిగిన ఒక ఉగ్రదాడిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.