Crime news : ఒక్క వ్యక్తి కిడ్నాప్‌కు ఊరంతా వచ్చింది! అడ్డుపడ్డ అధికారులపై దాడి- పోలీసు మృతి
MP crime news : మధ్యప్రదేశ్‌లో 200కుపైగా మంది ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి చంపేశారు. ఈ నేరాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది! ఒకే గ్రామానికి చెందిన 200కుపైగా మంది ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపైనా ఆ గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి సహా మొత్తం ఇద్దరు మరణించారు.
అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ గాద్రా గ్రామానికి చెందిన వార్త ఇది. 52ఏళ్ల అశోక్ కోల్ కుటుంబం, 24ఏళ్ల సన్నీ ద్వివేదీ కుటుంబ దగ్గర భూమిని లీజుకు తీసుకుని పొలం పనులు చేసేది. ఆ తర్వాత ద్వివేదీ కుటుంబం భూమి పక్కనే అశోక్ తన సొంతంగా ఒక ల్యాండ్ కొనుగోలు చేశాడు. అయితే, ఈ భూమిపై ద్వివేదీ కుటుంబం కన్నుపడిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి.
రెండు నెలల క్రితం 52ఏళ్ల అశోక్ కోల్ అనూహ్యంగా మరణించాడు. మౌగంజ్ నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ద్వివేదీ కుటుంబమే తమ అశోక్‌ని చంపిందని కోల్ కుటుంబం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అనంతరం.. అశోక్‌ని ఎవరు చంపలేదని, మౌగంజ్ నుంచి తిరిగొస్తుండగా అతని బైక్ గేదెను ఢీకొట్టిందని, అతను కిందపడి మరణించాడని రిపోర్టు ఇచ్చింది.
పోలీసుల రిపోర్టును కోల్ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. తమ అశోక్‌ని ద్వివేదీ కుటుంబమే చంపిందని, అప్పటి నుంచి కక్ష పెంచుకుంది.
ఇక మార్చ్ 15, శనివారం ద్వివేదీ తన దుకాణం నుంచి ఇంటికి తిరిగివెళుతుండగా కోల్ కుటుంబం అతడిని అడ్డుకుంది. అతడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో గ్రామానికి చెందిన 250కిపైగా మంది అక్కడికి వెళ్లారు. వారిలో చాలా మంది ద్వివేదీని దారుణంగా కొట్టారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. పోలీసులను చూసిన గ్రామస్థులు మరింత రెచ్చిపోయారు! 200కుపైగా మందితో పాటు కోల్ కుటుంబసభ్యులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. వారి నుంచి లాఠీలు లాక్కుని మరీ పోలీసులనే కొట్టారు. ఈ ఘటనలో స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్ (ఎస్ఏఎఫ్) సబ్- ఇన్స్పెక్టర్ రామ్‌చరణ గౌతమ్ సహా మొత్తం 10 గాయపడ్డారు. వీరిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలి చికిత్స పొందుతూ పోలీసు అధికారి రామ్‌చరణ్ మరణించారు.
కొన్ని గంటల తర్వాత గాద్రా గ్రామంలో సన్నీ ద్వివేదీ మృతదేహం లభించింది. సన్నీని కిడ్నాప్ చేసిన తర్వాత అతడిని దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై 50కిపైగా మంది మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మర్డర్, హత్యాయత్నం, కిడ్నాప్, పోలీసులపై దాడి కింద ఛార్జీలు వేశారు. ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టి.. ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.
గాద్రా గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు జిల్లా కలెక్టర్.
ఒక్క వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు 200కుపైగా మంది వచ్చారని, పోలీసులపైనా దాడి చేశారన్న వార్త కలకలం సృష్టించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం