Jagdish Tytler: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్ పై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐని ఆదేశించింది. నిందితుడు జగదీష్ టైట్లర్ పై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు తెలిపింది. టైట్లర్ పై ఐపీసీ 143, 147 153ఏ, 188, 295, 436, 451, 380, 149, 302, 109 సెక్షన్ల కింద విచారణ కొనసాగించవచ్చని పేర్కొంది.
1984లో గురుద్వారా పుల్ బంగాష్ సమీపంలో ముగ్గురు సిక్కులను చంపడం, మతపరమైన ప్రదేశంలో దహనం చేయడం వంటి కేసులకు సంబంధించి ఈ కేసు నమోదైంది. ఈ సంఘటన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగింది.
1984 నవంబర్ 1న పుల్ బంగాష్ గురుద్వారా సమీపంలో గుమిగూడిన గుంపును కేంద్ర మాజీ మంత్రి టైట్లర్ రెచ్చగొట్టారని 2023 మేలో దాఖలు చేసిన చార్జిషీట్లో సీబీఐ ఆరోపించింది. గురుద్వారా ముందు వైట్ అంబాసిడర్ కారు నుంచి బయటకు వచ్చిన టైట్లర్ ‘సిక్కులను చంపండి, వారు మా తల్లిని హత్య చేశారు’ అని అరుస్తూ జనాన్ని రెచ్చగొట్టారని ప్రత్యక్ష సాక్షి ఒకరు ఆరోపించారు. అంతకుముందు రోజు ప్రధాని ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు హత్య చేయడంతో ఆగ్రహించిన గుంపు ముగ్గురు వ్యక్తులను హతమార్చింది.
ఆ గందరగోళంలో జగదీశ్ టైట్లర్ అక్కడున్న గుంపుకు చెప్పినది తాము వినలేదని, అయితే అతను కారు దిగి ప్రసంగించడం చూశామని చాలా మంది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ కేసులో గత ఏడాది ఆగస్టులో సెషన్స్ కోర్టు టైట్లర్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది, దీనికి రూ. 1 లక్ష వ్యక్తిగత బాండ్, అంతే మొత్తంలో పూచీకత్తు కోరింది. టైట్లర్ పై ఐపీసీ సెక్షన్ 147 (అల్లర్లు), 109 (ప్రేరేపణ), 302 (హత్య) తదితర సెక్షన్ల కింద కేంద్ర దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది.