100 plastic surgeries: ఫేవరెట్ నటిలా కనిపించడం కోసం 100 ప్లాస్టిక్ సర్జరీలు; 5 కోట్ల ఖర్చు-18yearold woman spends nearly 5 crore rupees on plastic surgeries in china ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  100 Plastic Surgeries: ఫేవరెట్ నటిలా కనిపించడం కోసం 100 ప్లాస్టిక్ సర్జరీలు; 5 కోట్ల ఖర్చు

100 plastic surgeries: ఫేవరెట్ నటిలా కనిపించడం కోసం 100 ప్లాస్టిక్ సర్జరీలు; 5 కోట్ల ఖర్చు

HT Telugu Desk HT Telugu

China News: చైనాలోని ఓ 18 ఏళ్ల యువతి తనకు ఇష్టమైన నటిలా తన రూపాన్ని మార్చుకునేందుకు 100కు పైగా ఆపరేషన్లు చేయించుకుంది. అందుకోసం సుమారు రూ. 5 కోట్లు ఖర్చు చేసింది.

చైనీస్ నటి ఎస్తేర్ యు

18 ఏళ్ల యువతి తన రూపాన్ని, తనకు ఇష్టమైన నటిలా మార్చుకోవడం కోసం 100 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందని వెలుగులోకి రావడంతో ప్రజలు షాక్ కు గురయ్యారు. చైనాకు చెందిన ఓ బాలిక 13 ఏళ్ల వయసులోనే ఈ సర్జరీ ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని సర్జరీలు చేయించుకోవడానికి సమయం కేటాయించడం కోసం ఆమె తన పాఠశాలను కూడా విడిచిపెట్టినట్లు సమాచారం.

100 కు పైగా సర్జరీలు

తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ కు చెందిన ఝౌ చునా (Zhou Chuna) అనే బాలికకు చైనీస్ నటి ఎస్తేర్ యు (Esther Yu) అంటే చాలా ఇష్టం. తన ఫేవరెట్ నటి ఎస్తేర్ యు వలె అందంగా కనిపించడానికి ఆ బాలిక 13 ఏళ్ల వయస్సు నుంచి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం ప్రారంభించింది. ఈ సర్జరీలకు అయిన ఖర్చును ఆమె తల్లిదండ్రులు చెల్లించారు.

అందంగా కనిపించాలని..

చిన్నప్పటి నుంచి తనకు అందంగా కనిపించాలని ఉండేదని ఝౌ చునా (Zhou Chuna) తెలిపింది. తన లుక్స్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేదానినని, దానివల్ల డిప్రెషన్ లోకి కూడా వెళ్లానని ఆమె వెల్లడించింది. ఝౌ చునా తల్లి చాలా అందంగా ఉండేది. తల్లి వలె ఝౌ చునా అందంగా లేదని బంధువులు, కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలు ఆమె ఒత్తిడిని మరింత పెంచాయి. షాంఘైలోని ఒక అంతర్జాతీయ పాఠశాలకు హాజరైనప్పుడు, ఆమె తన తోటి విద్యార్థులు తన కంటే అందంగా, మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నారని నమ్మింది. తన అందాన్ని మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్న ఆమె.. అందుకు ఏకైక మార్గం ప్లాస్టిక్ సర్జరీలేనని నిర్ణయించుకుంది.

బోన్ షేవింగ్ కూడా..

ఝౌ చునా (Zhou Chuna) దాదాపు 13 ఏళ్ల వయస్సు నుంచే ఈ శస్త్ర చికిత్సలు చేయించుకోవడం ప్రారంభించింది. ఆమెకు దాదాపు 100 సర్జరీలు (100 plastic surgery procedures) జరిగాయి. వాటిలో రైనోప్లాస్టీ (rhinoplasty), బోన్ షేవింగ్ (bone shaving) కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ సర్జరీల కోసం ఆమె దాదాపు రూ. 5 కోట్లు ఖర్చు చేసింది. ఈ సర్జరీలు చేయించుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి తన వైద్యులు హెచ్చరించారని, కొందరు డాక్టర్లు సర్జరీ చేయడానికి నిరాకరించారని ఆమె చెప్పారు. "ఝౌ చునా కు ఇక ప్లాస్టిక్ సర్జరీ చేయకూడదు. ఇంకా సర్జరీలు చేస్తే తీవ్రమైన సమస్యలు వస్తాయి. వాటిలో ముఖ నరాల వైఫల్యం, మత్తుమందు మితిమీరిన వాడకం వల్ల మెదడు దెబ్బతినడం వంటివి ఉంటాయి’’ అని షాంఘైకి చెందిన ప్రైవేట్ మెడికల్ కాస్మెటిక్ ఆసుపత్రి వైద్యుడు లిన్ యోంగ్గాంగ్ చెప్పారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.