Parliament session : 18వ లోక్​సభ తొలి సమావేశాలు ప్రారంభం.. మొదటి రోజే విపక్షాల నిరసనలు..-18th lok sabhas first parliament session begins amid neet pro tem speaker row ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Parliament Session : 18వ లోక్​సభ తొలి సమావేశాలు ప్రారంభం.. మొదటి రోజే విపక్షాల నిరసనలు..

Parliament session : 18వ లోక్​సభ తొలి సమావేశాలు ప్రారంభం.. మొదటి రోజే విపక్షాల నిరసనలు..

Sharath Chitturi HT Telugu
Updated Jun 24, 2024 11:44 AM IST

Parliament session : 18వ లోక్​సభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత.. ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేశారు.

లోక్​సభలో బీజేపీ ఎంపీలు..
లోక్​సభలో బీజేపీ ఎంపీలు..

18th Lok Sabha Parliament session : 18వ లోక్​సభకు సంబంధించిన తొలి పార్లమెంట్​ సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. ఎంపీగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత ప్రమాణం చేయించారు ప్రోటెం స్పీకర్​ భర్తృహరి మహతాబ్.

మొదటి రెండు రోజుల పాటు నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. తొలిరోజు 280మంది, రెండో రోజు 260మంది ఎంపీలుగా ప్రమాణం చేస్తారు.

ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనంతరం.. కేంద్ర మంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్​ సింగ్​, నితిన్​ గడ్కరీ, కుమారస్వామి, మనోహర్​ లాల్​ కట్టర్​, పీయుష్​ గోయల్​, ధర్మేంద్ర ప్రధాన్​, జితిన్​ రామ్​ మంఝి, రాజీవ్​ రంజన్​లు.. ఎంపీలుగా ప్రమాణం చేశారు.

మోదీ కేబినెట్​లో విమానయానశాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన కే. రామ్మోహన్​ నాయుడు సైతం.. సోమవారం ఉదయం ఎంపీగా ప్రమాణం చేశారు.

ప్రోటెం స్పీకర్​ ఎంపికపై వివాదం..

అంతకన్నా ముందు.. సోమవారం ఉదయం, బీజేపీ ఎంపీ బత్రుహరి మహ్తబ్​ చేత ప్రోటెం స్పీకర్​గా ప్రమాణం చేయించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పార్లమెంట్​లో రెండు రోజుల పాటు నూతన ఎంపీల చేత ఆయన ప్రమాణం చేయిస్తారు.

కాగా.. ప్రోటెం స్పీకర్​గాభర్తృహరి మహతాబ్​ని బీజేపీ ఎంపిక చేయడంపై విపక్షాలు మండిపడ్డాయి. సభలో సీనియర్​ ఎంపీని ప్రోటెం స్పీకర్​గా నియమించడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని, ఈసారి దానిని బీజేపీ పట్టించుకోలేదని ఆరోపించాయి.

Parliament session live updates : సంప్రదాయం ప్రకారం అయితే.. కాంగ్రెస్​ నేత కే. సురేశ్​ ప్రోటెం స్పీకర్​ అవ్వాలని కానీ ఆయనొక దళిత నేత అయినందునే.. అవకాశం ఇవ్వలేదని ఆ పార్టీ ఆరోపిస్తోంది. దీనిని బీజేపీ తప్పుబట్టింది.

ఇక ప్రోటెం స్పీకర్​ వివాదం, నీట్​ వివాదం, పేపర్​ లీక్​ వ్యవహారం మధ్య పార్లమెంట్​ సమావేశాలు జరుగుతుండటంతో.. అధికారపక్షంపై విపక్షాలు ఏమేరకు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయో చూడాలి.

వాస్తవానికి.. పార్లమెంట్​ సమావేశాలు మొదలవ్వడానికి కొంతసేపటి ముందే విపక్షాలు నిరసనలు మొదలుపెట్టాయి. పార్లమెంట్​ బయట.. రాజ్యాంగాన్ని పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ఇండియా కూటమి ఎంపీలు.

భారత్​కు బాధ్యతాయుత విపక్షం కావాలి..

పార్లమెంట్​ సమావేశాల ప్రారంభానికి కొంతసేపటి ముందు.. మీడియాతో మాట్లాడారు ప్రధాని మోదీ.

“ప్రభుత్వాన్ని నడిపేందుకు మెజారిటీ కావాలని మా నమ్మకం. అయితే.. దేశాన్ని నడిపించేందుకు అందరి ఏకాభిప్రాయం కావాలి. ఈ సంప్రదాయాన్ని గత 10ఏళ్లుగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాము. 140కోట్ల బారతీయుల కలలను నెరవేర్చేందుకు, భరత మాతకు సేవ చేసేందుకు మనం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. అందరిని కలసిగట్టుగా కలుపుకుని, రాజ్యంగం పవిత్రతను మెయిన్​టైన్​ చేస్తూ.. నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నాము. ఇండియాకు బాధ్యతాయుత విపక్షం కావాలి. ప్రజలకు నినాదాల కన్నా పనితనం కావాలి. చర్చలు కావాలి . పార్లమెంట్​లో ఆందోళనలు అక్కర్లేదు. మంచి చేసే విషయంలో విపక్షాలు ఇప్పటివరకు అసంతృప్తి పరిచాయి. ఈసారైనా తమ బాధ్యతను విపక్షాలు నిర్వర్తిస్తాయని ఆశిస్తున్నాను,” అని మోదీ అన్నారు.

జులై 3తో ముగింపు..

Parliament session latest news : సోమవారం ఉదయం ప్రారంభమైన పార్లమెంట్​ సమావేశాలు.. జులై 3తో ముగిస్తాయి. ఇందాక చెప్పినట్టు.. మొదటి రెండు రోజులు.. ఎంపీల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆ తర్వాత, జూన్​ 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జులై 3న పార్లమెంట సమావేశాలు పూర్తవుతాయి.

ఆ తర్వాత.. పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు జులై 22న మొదలవుతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.