Rat Hole Mining : అస్సాంలో బొగ్గు గనిలో చిక్కుకున్న 18 మంది.. వీరు ఫాలో అయ్యే 'ర్యాట్ హోల్' మైనింగ్ టెక్నిక్ అంటే ఏంటి?-18 people trapped due to waterlogging in assam know what is rat hole mining technique ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rat Hole Mining : అస్సాంలో బొగ్గు గనిలో చిక్కుకున్న 18 మంది.. వీరు ఫాలో అయ్యే 'ర్యాట్ హోల్' మైనింగ్ టెక్నిక్ అంటే ఏంటి?

Rat Hole Mining : అస్సాంలో బొగ్గు గనిలో చిక్కుకున్న 18 మంది.. వీరు ఫాలో అయ్యే 'ర్యాట్ హోల్' మైనింగ్ టెక్నిక్ అంటే ఏంటి?

Anand Sai HT Telugu
Jan 06, 2025 09:42 PM IST

Rat Hole Mining Technique : అస్సాంలో పెద్ద ప్రమాదం సంభవించింది. ర్యాట్ హోల్ మైన్ తవ్వుతుండగా 18 మంది కార్మికులు చిక్కుకున్నారు. కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతోంది. ఇంతకీ ఈ ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్ అంటే ఏంటి?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అస్సాంలోని డిమా హసావో జిల్లాలోని పారిశ్రామిక పట్టణమైన ఉమ్రాంగ్సోలో పెద్ద ప్రమాదం జరిగింది. ఇక్కడ 300 అడుగుల లోతున్న బొగ్గు గనిలో తవ్వుతున్న సమయంలో నీరు నిండిపోవడంతో 18 మంది కూలీలు చిక్కుకుపోయారు. అనంతరం అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ర్యాట్ హోల్ గని 100 అడుగుల వరకు నీటితో నిండిపోయింది. ఈ ప్రాంతం మేఘాలయ సరిహద్దుకు సమీపంలో ఉంది.

yearly horoscope entry point

ప్రస్తుతం టన్నెల్‌ నుంచి రెండు మోటార్‌ పంపుల సాయంతో నీటిని బయటకు తీస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం గౌహతి నుంచి అనేక బృందాలను కూడా పంపించారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు కూడా వెళ్లాయి. ప్రస్తుతం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో ఆర్మీ సహాయాన్ని కోరినట్లుగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.

ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ఒక ప్రమాదకరమైన సాంకేతికత. ఇక్కడ కార్మికులు ఇరుకైన సొరంగాలను తవ్వి లోపలకు వెళ్తారు. వాటి నుండి బొగ్గు తవ్వుతారు. సన్నని గుంతలు తవ్వి వాటి నుంచి బొగ్గు తీయడమే ర్యాట్ హోల్ మైనింగ్. నేలలో ఇరుకైన గుంతలు తవ్వేస్తారు. ఒక్క మనిషి వెళ్లగలిగే వెడల్పు మాత్రమే ఉంటుంది. తర్వాత బొగ్గు పొరను చేరుకున్నాక.. బొగ్గును వెలికితీయడానికి సొరంగాన్ని ఏర్పాటు చేస్తారు.

ఈ రకమైన తవ్వకాల్లో పారతోపాటుగా ఇత పనిముట్లను ఉపయోగించి చేతితో మాత్రమే బొగ్గు తవ్వుతారు. తాళ్లు, నిచ్చెనలు ఉపయోగించి.. లోపలకు వెళ్లి తవ్వి కొంత దూరంలో బొగ్గును డంప్ చేస్తారు. అక్కడ నుంచి ట్రాలీ ద్వారా బయటకు తరలిస్తారు.

ఈ పద్ధతిలో తవ్వడం ఉలి, సుత్తితో మాత్రమే జరుగుతుంది. చెత్తను పార సహాయంతో పైకి రవాణా చేస్తారు. మేఘాలయ, అస్సాంలోని అనేక ప్రాంతాల్లో ఈ పద్ధతిని ఉపయోగించి తవ్వకాలు జరుపుతారు. ఇక్కడ చాలా సన్నని బొగ్గు సొరంగాలు ఉన్నాయి. సొరంగాల పరిమాణం చిన్నది, అందువల్ల ఇందులో యువకులు, చిన్న పిల్లల సహాయం కూడా తీసుకుంటారు. చాలా మంది పిల్లలు డబ్బు కోసం ఎక్కువ వయసు ఉన్నవారిలా పని ప్రదేశంలో నటిస్తారు.

ర్యాట్ హోల్ సొరంగాలు ఇరుకైనవి. ఇవి పర్యావరణానికి హానికరమైనవిగా కూడా అని చెబుతారు. ఎందుకంటే గనుల నుండి వెలువడే ఆమ్ల జలాలు, లోహాలు భూమికి హాని కలిగిస్తాయి. దీంతో వ్యవసాయానికి, మానవ అవసరాలకు వినియోగించే నీటి వనరులలోని నీరు విషతుల్యంగా మారుతోంది. 2018లో మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలో ర్యాట్ హోల్ మైనింగ్‌లో పెద్ద ప్రమాదం జరిగింది.

ఒక అంచనా ప్రకారం మేఘాలయలో 24 వేల గనులు అక్రమంగా ఉన్నాయి. అక్రమ బొగ్గు తవ్వకాలను ఆపడంలో విఫలమైనందుకు 2019లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఈ రాష్ట్రానికి 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అయితే అంతకు ముందే ర్యాట్ హోల్ మైనింగ్ పద్ధతి శాస్త్రీయంగా లేదని 2014లో నిషేధించింది. ప్రమాదక పరిస్థితుల్లో పనితో కార్మికుల ప్రాణాలు పోతున్నాయని ఎన్జీటీ పేర్కొంది. ఇంకా ఇలాంటి ర్యాట్ హోల్ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయనడానికి తాజాగా ఘటనే ఉదాహరణ.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.