గర్భం దాల్చడంతో మొదలైన గొడవ.. బాయ్​ఫ్రెండ్​ గొంతుకోసి హత్య చేసిన 16ఏళ్ల బాలిక!-16 year old pregnant slits boyfriend throat with knife in chhattisgarh ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  గర్భం దాల్చడంతో మొదలైన గొడవ.. బాయ్​ఫ్రెండ్​ గొంతుకోసి హత్య చేసిన 16ఏళ్ల బాలిక!

గర్భం దాల్చడంతో మొదలైన గొడవ.. బాయ్​ఫ్రెండ్​ గొంతుకోసి హత్య చేసిన 16ఏళ్ల బాలిక!

Sharath Chitturi HT Telugu

ఛత్తీస్​గఢ్​లో షాకింగ్​ ఘటన జరిగింది. ఓ 16ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. బాయ్​ఫ్రెండ్​కి ఈ విషయం చెప్పగా అబార్షన్​ చేయించుకోమని ఒత్తిడి చేశాడు. అది ఆమెకు నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరికి, ఆ బాలిక ఆ వ్యక్తిని గొంతు కోసి చంపేసింది!

బాయ్​ఫ్రెండ్​ గొంతుకోసి హత్య చేసిన 16ఏళ్ల బాలిక!

ఛత్తీస్​గఢ్​లో జరిగిన ఒక షాకింగ్​ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రాయ్‌పూర్ నగరంలోని గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక లాడ్జిలో ఓ యువకుడి మృతదేహాన్ని పోలీసులు ఆదివారం కనుగొన్నారు. ఈ దారుణ హత్యను అతడి 16 ఏళ్ల ప్రియురాలు చేసినట్లు తెలిసింది. హత్య అనంతరం ఇంటికి తిరిగి వెళ్లిన ఆ బాలిక, జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పంది. అప్పుడే ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది!

అసలేం జరిగింది?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలాస్‌పూర్‌లోని కోనీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఆ బాలిక, తన ప్రియుడు మహ్మద్ సద్దాంను కలవడానికి సెప్టెంబర్ 28న రాయ్‌పూర్​కి వెళ్లింది. బిహార్‌కు చెందిన సద్దాం, అభన్‌పూర్‌లో ఎంఎస్ ఇంజినీరింగ్ అధికారిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ రాయ్‌పూర్‌లోని రామన్ మందిర్ వార్డు, సత్కార్ గల్లీలో ఉన్న అవోన్ లాడ్జిలో శనివారం నుంచి కలిసి ఉంటున్నారు.

సద్దాం కారణంగా గర్భం దాల్చిన బాలికపై అతను గర్భస్రావం చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. దాని వల్ల వారిద్దరి మధ్య సంబంధం దెబ్బతిన్నట్లు విచారణలో వెల్లడైంది. కొద్ది రోజుల క్రితం లాడ్జి వెలుపల జరిగిన వాగ్వాదంలో సద్దాం ఆ బాలికను కత్తితో బెదిరించాడని కూడా పోలీసులు తెలుసుకున్నారు.

సెప్టెంబర్ 28 రాత్రి సద్దాం లాడ్జి గదిలో నిద్రిస్తున్న సమయంలో, ఆ బాలిక అదే పదునైన ఆయుధాన్ని తీసుకుని తీవ్ర కోపంతో అతడి గొంతు కోసింది. ఆ తర్వాత గదికి బయట తాళం వేసి, సద్దాం మొబైల్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయింది. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు లాడ్జి గది తాళాన్ని సమీపంలోని రైల్వే ట్రాక్‌లపైకి విసిరేసింది.

తల్లికి విషయం చెప్పడంతో..

తరువాతి ఉదయం ఆ బాలిక బిలాస్‌పూర్‌కు వెళ్లిపోయింది. ఆమె తల్లి అడగడంతో, బాలిక కుమిలిపోతూ జరిగింది మొత్తం వివరించింది. షాకైన ఆమె తల్లి వెంటనే బాలికను వెంటబెట్టుకుని కోనీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విషయాన్ని రిపోర్ట్ చేసింది. బాలిక చెప్పిన సమాచారం మేరకు రాయ్‌పూర్ పోలీసులు హుటాహుటిన అవోన్ లాడ్జికి చేరుకోగా, సద్దాం రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు.

పోలీస్ అధికారులు సద్దాం కుటుంబ సభ్యులను బిహార్‌లో సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. "మృతుడి ఫోన్ మా ఆధీనంలో ఉంది, ఆ నంబర్ ద్వారా అతడి కుటుంబ సభ్యులను గుర్తించే పనిలో ఉన్నాం. కేసు నమోదు చేసి, మైనర్ బాలికను విచారిస్తున్నాము," అని రాయ్‌పూర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

"ఇది తీవ్రమైన భావోద్వేగం, నిస్సహాయత కారణంగా జరిగిన నేరంగా కనిపిస్తోంది. ఇది ముందుగా ప్లాన్ చేసి చేసిందా లేదా ఆవేశంలో జరిగిందా అనే విషయం విచారణలో తెలుస్తుంది," అని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.

ప్రేమగా మొదలై మోసం, హింసస మరణంతో ముగిసిన ఈ టీనేజ్ బంధం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, బిలాస్‌పూర్‌లలో తీవ్ర సంచలనం సృష్టించింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.