Delhi murder case : బాల్ విషయంలో గొడవ- 14ఏళ్ల బాలుడిని రౌండప్ చేసి చంపేశారు..!
Delhi boy killed in school : దిల్లీలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఓ 14ఏళ్ల బాలుడిని ఏడుగురు రౌండప్ చేసి చంపేశారు! ఈ ఘటనలో ఐదుగురు స్కూల్‌మేట్స్ నిందితులుగా ఉన్నారు.
దిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 14ఏళ్ల బాలుడిపై ఏడుగురి బృందం దాడి చేసి చంపేశారు! వీరిలో ఐదుగురు స్కూల్‌మేట్స్ కూడా ఉన్నారు.
ఇదీ జరిగింది..
తూర్పు దిల్లీలోని దిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల బాలుడిపై ఐదుగురు స్కూల్ మేట్స్, ఇద్దరు పెద్దలు దాడి చేయడంతో శుక్రవారం సాయంత్రం అతను మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
పాఠశాల వెలుపల జరిగిన దాడిలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తొడపై కత్తితో పొడిచారు. తీవ్ర రక్తస్రావంతో అతను మృతి చెందాడు. 9, 12 తరగతులకు చెందిన 14 నుంచి 17 ఏళ్ల వయసున్న ఐదుగురు మైనర్లను, 19, 31 ఏళ్ల వయసున్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు గణేష్ నగర్ నివాసి కాగా, నిందితులు మండవాలి ప్రాంతంలో ఉంటున్నారు.
బాధితుడు, పట్టుబడిన తోటి విద్యార్థులకు మధ్య వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో అదనపు తరగతుల అనంతరం విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు వస్తుండగా గేమ్‌లో బంతి విషయంలో వాగ్వాదం చోటు చేసుకుందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు) అభిషేక్ ధనియా తెలిపారు.
అనంతరం క్లాస్‌లోని మరో విద్యార్థి నుంచి ఫోన్ తీసుకున్న మైనర్.. తన కుటుంబానికి ఫోన్ చేశాడు. గొడవ కోసం మనుషులను పంపించమని అంకుల్‌కి చెప్పాడు. ఆ అంకుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
"స్కూల్ ముగిసే సమయానికి క్లాస్మేట్, అతని సహచరులు, ఇద్దరు బయటి వ్యక్తులు, మరో నలుగురు విద్యార్థులు ప్రధాన గేటు బయట వేచి ఉన్నారు. సీనియర్లలో ఒకరు బాలుడి కుడి తొడపై కత్తితో పొడచడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థి రక్తస్రావం కావడంతో దుండగులు పారిపోయారు," అని డీసీపీ ధనియా చెప్పారు.
పాఠశాల సిబ్బంది మొదట గాయపడిన బాలుడికి ప్రథమ చికిత్స చేసి హెడ్గేవార్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతని పరిస్థితి తీవ్రత కారణంగా వైద్యులు గురుతేజ్ బహదూర్ (జీటీబ) ఆసుపత్రికి రెఫర్ చేశారు. అయితే జీటీబీ ఆసుపత్రికి తరలించేలోపే మైనర్ మృతి చెందాడు. శనివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
బాలుడు తనకు హాని చేస్తాడనే భయంతో బాధితుడిపై కక్ష పెంచుకున్నట్లు క్లాస్మేట్ అంగీకరించాడని డీసీపీ ధనియా తెలిపారు. నేరానికి ఉపయోగించిన కత్తిని, దాడి చేసిన వారి దుస్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 103 కింద హత్య కేసు నమోదు చేశారు. పట్టుబడిన మైనర్ బాలురను జువైనల్ జస్టిస్ బోర్డు (జేజేబీ) ముందు హాజరుపరచగా, అరెస్టు చేసిన వారిని జిల్లా కోర్టుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
సంబంధిత కథనం