Earthquake: మయన్మార్, థాయ్ లాండ్ భూకంప మృతుల సంఖ్య 147; థాయిలాండ్ లో భారతీయులందరూ క్షేమం
Earthquake: మయన్మార్, థాయ్ లాండ్ లలో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంప ప్రమాదంలో అధికారిక లెక్కల ప్రకారం 147 మంది చనిపోయారు. 144 మంది మయన్మార్ లో, ముగ్గురు థాయిలాండ్ లో చనిపోయారు. భూకంపం తీవ్రతకు భవనాలు చివురుటాకుల్లా ఊగాయి. చాలా భవనాలు నేలకూలాయి. ప్రజలు భయంతో పరుగులు తీశారు.
మార్చి 28 మయన్మార్, థాయ్ లాండ్ లలో మరో సాధారణ రోజు మాత్రమే. జనజీవనంతో కిటకిటలాడే వీధులు, దుకాణదారులతో కిటకిటలాడే మార్కెట్లు, యధావిధిగా వ్యాపారాలు నడుస్తున్నాయి. కానీ ఒక్క క్షణంలోనే 7.7 తీవ్రతతో భూకంపం సంభవించి, ఆ తర్వాత 6.4 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించి జీవితాల్ని తలక్రిందులు చేశాయి. మయన్మార్, థాయ్ లాండ్ లతో పాటు, భారత్, వియత్నాం, బంగ్లాదేశ్ లలో ప్రకంపనలు సంభవించాయి.
144 మంది మృతి
భూకంపం తీవ్రతకు చాలా నిర్మాణాలు నేలమట్టం అయ్యాయి. డజన్ల కొద్దీ ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. మయన్మార్ లో 144 మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శిధిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. దాంతో, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మయన్మార్ లో భారీ ప్రాణనష్టం సంభవిస్తుండటంతో సాయం కావాలని జుంటా చీఫ్ ప్రపంచ దేశాలు, సంస్థలను కోరారు.
మయన్మార్, థాయ్ లాండ్ భూకంపం గురించి టాప్ 10 పాయింట్లు
- మయన్మార్ లోని మాండలే సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. మధ్యాహ్న సమయంలో సంభవించిన భూకంపం 12 నిమిషాల వ్యవధిలో మరో 6.4 తీవ్రతతో ప్రకంపనలు సృష్టించింది. కేవలం 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
- మయన్మార్ లో 144 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ జుంటా చీఫ్ తెలిపారు. థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ లో ముగ్గురు చనిపోయారు.
- మాండలేలో భవనాలు కూలిపోయాయి, రోడ్లు కుంగిపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. మయన్మార్ లో ఆవా వంతెన కూడా కూలిపోయింది. ప్రజలు శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న మసీదులో మరణాలు సంభవించినట్లు వార్తలు వచ్చాయి.
- బ్యాంకాక్ లోని చతుచక్ మార్కెట్ లో నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భవనం కుప్పకూలింది.
- సెంట్రల్ బ్యాంకాక్ అంతటా సైరన్ల శబ్దం ప్రతిధ్వనించింది మరియు వాహనాలు వీధులను నింపాయి. ఎలివేటెడ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, సబ్ వే మూతపడ్డాయి.
- బ్యాంకాక్ విమానాశ్రయ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు లేవని పౌర విమానయాన శాఖ తెలిపింది.
- సహాయ చర్యలను సులభతరం చేయడానికి బ్యాంకాక్ సిటీ హాల్ నగరాన్ని విపత్తు ప్రాంతంగా ప్రకటించింది.
- మాండలేలో పరిస్థితి తీవ్రంగా ఉందని, భూకంపం కారణంగా మరింత ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని మయన్మార్ షాడో విదేశాంగ మంత్రి తెలిపారు. తక్షణ అంతర్జాతీయ మానవతా, సాంకేతిక సహాయాన్ని విదేశాంగ మంత్రి కోరారు.
- మయన్మార్ లోని సాగింగ్, మాండలే, నైపిటావ్ లలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
- భూకంపం తర్వాత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, భారతీయులంతా సురక్షితంగా ఉన్నారని థాయ్ లాండ్ లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
సంబంధిత కథనం