Road Accident : ఛత్తీస్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం- గుంతలోకి దూసుకెళ్లిన బస్సు, 12 మంది మృతి!-12 workers killed as bus falls into ditch in durg district of chhattisgarh ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Road Accident : ఛత్తీస్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం- గుంతలోకి దూసుకెళ్లిన బస్సు, 12 మంది మృతి!

Road Accident : ఛత్తీస్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం- గుంతలోకి దూసుకెళ్లిన బస్సు, 12 మంది మృతి!

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 10, 2024 07:33 AM IST

Chhattisgarh Road Accident Updates:ఛత్తీస్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంతలోకి దూసుకెళ్లిన ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా…14 మందికిపైగా గాయపడ్డారు.

ఛత్తీస్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం
ఛత్తీస్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం (ANI)

Chhattisgarh Durg Road Accident : ఛత్తీస్​గఢ్​లో విషాద ఘటన చోటు చేసుకుంది.దుర్గ్‌ జిల్లా ఖాప్రి గ్రామ సమీపంలో  ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 11 మంది స్పాట్ లోనే చనిపోగా… ఒకరు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ఈ ప్రమాదంలో… 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం…. మంగళవారం రాత్రి 8 దాటిన తర్వాత జరిగింది.

దుర్గ్ జిల్లా కలెక్టర్ రిచా ప్రకాశ్ చౌదరి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ప్రమాదంపై మాట్లాడుతూ… బస్సు మొత్తం కార్మికులతో నిండి ఉందని చెప్పారు. మంగళవారం రాత్రి బస్సు ఓ  గుంతలో పడిపోయిందని తెలిపారు.

"రాత్రి 8.30 గంటల సమయంలో కూలీలను తీసుకెళ్తున్న బస్సు కుమ్హారి సమీపంలోని గుంతలో పడిపోయింది, ఫలితంగా సుమారు 12 మంది కార్మికులు మరణించారు. మరో 14 మంది గాయపడి ఆసుపత్రిలో చేరారు" అని కలెక్టర్ చౌదరి PTIకి చెప్పారు. క్షతగాత్రులను ఎయిమ్స్ (రాయ్‌పూర్)కు తరలించినట్లు పేర్కొన్నారు.

"గాయపడినవారిలో పన్నెండు మందిని ఎయిమ్స్ (రాయ్‌పూర్)కు తరలించాం. మిగిలిన ఇద్దరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారందరి పరిస్థితి నిలకడగా ఉంది.  ఉత్తమమైన వైద్య సేవలను అందిస్తున్నాము" అని కలెక్టర్ వివరించారు.

మరోవైపు ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.ప్రమాదంపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఈ ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి మోదీతో పాటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ట్విట్ చేశారు.  గాయపడిన ఉద్యోగులకు చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని సీఎం విష్ణు దేవ్ సాయి తెలిపారు.

ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. “ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరం. ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సానుభూతి తెలియజేస్తున్నాను.  గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు.

Whats_app_banner

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.