Rajasthan bus accident: బస్సును వెనుకనుంచి ఢీ కొట్టిన ట్రక్; 11 మంది దుర్మరణం
Rajasthan bus accident: రాజస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సును వెనుకనుంచి ఒక భారీ ట్రక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న గుజరాత్ కు చెందిన 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Rajasthan bus accident: రాజస్తాన్ లోని భరత్ పూర్ జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జైపూర్ - ఆగ్రా హై వే పై బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
గుజరాత్ నుంచి భక్తులు..
గుజరాత్ నుంచి యూపీలోని మథురకు భక్తులతో వెళ్తున్న బస్సును డ్రైవర్ బుధవారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో హంత్ర సమీపంలోని ఒక ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు పక్కన నిలిపాడు. తెల్లవారుజాము కావడంతో వెలుతురు అంతగా లేదు. ఆ సమయంలో వేగంగా వచ్చిన ఒక ట్రక్ ఆ బస్సును వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఐదుగురు పురుషులు, ఆరుగురు స్త్రీలు ఉన్నారు. మృతులంతా గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లాలోని దిహోర్ పట్టణానికి చెందినవారు. ప్రమాద ఘటన తెలియగానే, స్థానిక అధికారులు, పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
ప్రధాని సంతాపం
రాజస్తాన్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుజరాత్ కు చెందిన భక్తులు మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సంతాపం వ్యక్తం చేశారు. రాజస్తాన్ లో జరిగిన ప్రమాదంలో గుజరాత్ కు చెందిన భక్తులు మృతి చెందడం తనను కలచివేసిందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మంచి వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. రాజస్తాన్ లో జరిగిన ప్రమాదంలో గుజరాత్ కు చెందిన భక్తులు మృతి చెందడంపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సంతాపం వ్యక్తం చేశారు.