ఆపరేషన్ సిందూర్ కింద క్షుణ్ణంగా చర్చించిన తర్వాత తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలను గుర్తించామని భారత సైన్యం తెలిపింది. మే 7న జరిగిన ఆపరేషన్‌లో 9 ఉగ్రవాద స్థావరాల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఆదివారం తెలిపారు. ఈ దాడుల్లో యూసుఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ వంటి వారు కూడా హతమయ్యారు.
లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ ఎస్ఎస్ శారద ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. పలు కీలక విషయాలు వెల్లడించారు. గత నెలలో జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని పలు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసేందుకు మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించామని అధికారులు చెప్పారు.
నియంత్రణ రేఖ వద్ద మే 7 నుంచి మే 10 వరకు జరిగిన కాల్పుల్లో పాక్ సైన్యం సుమారు 35 నుంచి 40 మంది సిబ్బందిని కోల్పోయిందని భారత సైన్యం ప్రకటించింది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్లలో సైనిక సిబ్బంది, పౌరులతో సహా భారతదేశానికి ఐదు మరణాలు సంభవించాయని అధికారులు తెలియజేశారు.
'సాయుధ దళాలకు చెందిన ఐదుగురు సహోద్యోగులకు నా నివాళులు అర్పిస్తున్నాను. ఆపరేషన్లలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన పౌరులకు కూడా నివాళులు. మృతుల కుటుంబాలకు ధైర్యంగా ఉండాలి. ఈ క్లిష్ట సమయంలో వీరుల త్యాగాలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది.' అని ఒక అధికారి అన్నారు.