Zero Oil Bendakaya Recipe: నూనె లేకుండా బెండకాయల కర్రీ.. చేసుకోండిలా.. వెయిట్ లాస్ డైట్‍కు బెస్ట్
Zero Oil Bendakaya Curry Recipe: వంట నూనె చుక్క కూడా వేసుకోకుండా బెండకాయ కర్రీ వండుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా సూటవుతుంది. నూనె లేని బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలంటే..
నూనె లేకుండా చేసుకునే వంటలు ఇటీవల ట్రెండింగ్‍లో ఉంటున్నాయి. ఆరోగ్య జాగ్రత్త కోసం నూనె ఎక్కువగా తీసుకోకూడదని అనుకునే వారు ఇలాంటివి ఫాలో అవుతున్నారు. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ జీరో ఆయిల్ వంటలు బాగా సూటవుతాయి. ఇలానే చుక్క నూనె వాడకుండా ‘బెండకాయ కర్రీ’ చేసుకోవచ్చు. టేస్టీగానూ ఉంటుంది. నూనె లేకుండా ఈ బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
జీరో ఆయిల్ బెండకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు
- 250 గ్రాముల బెండకాయలు (గుడ్రంగా కట్ చేసుకోవాలి)
- ఓ టేబుల్‍స్పూన్ జీలకర్ర
- ఓ తరిగిన ఉల్లిపాయ
- ఓ ఉల్లిపాయ పేస్ట్
- ఓ టమాటా ప్యూరీ (టమాటాను పేస్ట్ చేయాలి)
- రెండు పచ్చిమిర్చి (కట్ చేసుకోవాలి)
- రెండు స్పూన్‍ల నీరు
- ధనియాల పొడి
- సరిపడా ఉప్పు
జీరో ఆయిల్ బెండకాయ కర్రీ తయారీ విధానం
బెండకాయలను శుభ్రంగా నీటితో కడిగి గుడ్రంగా తరుక్కోవాలి. ఓ ఉల్లిపాయను పేస్ట్‌లా చేసుకోవాలి. ఓ టమాటాను ప్యూరీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ముందుగా స్టవ్‍పై నాన్‍స్టిక్ ప్యాన్ పెట్టాలి. కాస్త వేడెక్కాక జీలకర్ర వేయాలి. దాన్ని కాస్త కలుపుతూ వేపుకోవాలి.
- ఆ తర్వాత ప్యాన్‍లో తరిగిన ఉల్లిపాయలను వేసుకొని సుమారు 3 నిమిషాల పాటు మీడియం మంటపై వేయించుకోవాలి.
- ఉల్లిపాయ ముక్కలు కాస్త గోల్డెన్ కలర్ వస్తుంటేనే ఉల్లిపాయ పేస్ట్, రెండు స్పూన్‍ల నీరు వేయాలి. ఆ తర్వాత ఓ నిమిషం పాటు మూత పెట్టి అలా ఉంచాలి.
- ఆ తర్వాత మూతతీసి కారం పొడి, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, టమాటా ప్యూరీ వేసేయాలి. అన్నింటినీ బాగా కలపాలి. దీంతో గ్రేవీ రెడీ అవుతుంది.
- అనంతరం దాంట్లో కట్ చేసుకున్న బెండకాయలను వేసి బాగా కలపాలి. ముక్కలకు ఆ గ్రేవీ అంటేలా మిక్స్ చేయాలి. మూతమూసి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
- రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి బాగా కలపాలి. మళ్లీ మూత మూసి బెండకాయ ముక్కలు మగ్గే వరకు మీడియం మంట పెట్టాలి. మగ్గిన తర్వాత కర్రీ రెడీ అవుతుంది. దీంతో చుక్క నూనె లేకుండా బెండకాయ కర్రీ తయారవుతుంది. పాన్ దించేసుకోవాలి. చపాతీలు, రొట్టెలు, అన్నంలోకి ఈ కర్రీ బాగుటుంది.
బెండకాయలోని పోషకాలు
బెండకాయలో విటమిన్ సీ, ఏ, కే1 సహా మెగ్నిషియం, ఫోలెట్, ఫైబర్, యాంకీఆక్సిడెంట్లు సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. బెండకాయ తినడం వల్ల పూర్తిస్థాయి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. రోగ నిరోధక శక్తి మెరుగుపడడంతో పాటు గుండె, కళ్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బీపీ నియంత్రణలో ఉండేందుకు తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి బెండకాయ సహకరిస్తుంది. నూనె లేకుండా వండుకుంటే బెండలోని పోషక విలువలు పెద్దగా తగ్గవు.