ఈ ఆరోగ్య సమస్య ఉంటే సంతానోత్పత్తికి అడ్డంకే.. డాక్టర్లు చెబుతున్నదిదే-your blood pressure may be killing your fertility what doctors want you to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఈ ఆరోగ్య సమస్య ఉంటే సంతానోత్పత్తికి అడ్డంకే.. డాక్టర్లు చెబుతున్నదిదే

ఈ ఆరోగ్య సమస్య ఉంటే సంతానోత్పత్తికి అడ్డంకే.. డాక్టర్లు చెబుతున్నదిదే

HT Telugu Desk HT Telugu

మీరు యంగ్‌గా, ఫిట్‌గా ఉన్నారా, కానీ సంతానం కలగడం లేదా? మీ గుండె సమస్యలే దీనికి కారణం కావచ్చు. రక్తపోటు ఎక్కువైతే గుండె జబ్బులే కాకుండా, సంతానోత్పత్తిపైనా చాలా ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

రక్తపోటు అధికంగా ఉండడం సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు (Pixabay)

సాధారణంగా సంతానలేమి సమస్యలు అంటే హార్మోన్ల సమస్యలు, పీరియడ్స్ సరిగా రాకపోవడం లేదా వీర్యం నాణ్యత తగ్గడం వంటివి గుర్తుకొస్తాయి. కానీ రక్తపోటు (హైపర్‌టెన్షన్) కూడా ఒక కారణమని చాలా మంది గుర్తించరు. సహజంగా గర్భం దాల్చడానికి ఇబ్బందులు పడటం నుంచి IVF విజయవంతం కాకపోవడం, గర్భధారణ సమయంలో సమస్యలు రావడం వరకు.. రక్తపోటు సంతానలేమిలో తక్కువ అంచనా వేసే ఒక కారణం.

"హైబీపీ కేవలం గుండెను మాత్రమే కాదు. ఇది సంతానోత్పత్తి, IVF విజయవంతం కావడం, చివరికి గర్భధారణ ఆరోగ్యంపై కూడా పెద్ద ప్రభావం చూపుతుంది" అని ప్రిస్టిన్ కేర్ ఫెర్టిసిటీలో రీప్రొడక్టివ్ మెడిసిన్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఇల గుప్తా హిందుస్తాన్ టైమ్స్ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

చాలా మంది గుర్తించని సంబంధం:

మీరు ఆరోగ్యంగా, యంగ్‌గా, యాక్టివ్‌గా ఉన్నారని అనిపించవచ్చు. కానీ మీ రక్తపోటు ఎక్కువగా ఉంటే, అది పునరుత్పత్తి అవయవాలకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. మహిళల్లో, రక్తపోటు గుడ్డు నాణ్యత, హార్మోన్ల సమతుల్యత, గర్భం దాల్చడానికి గర్భాశయం సిద్ధంగా ఉండే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. పురుషులలో, అధిక రక్తపోటు వీర్య కణాల సంఖ్యను తగ్గిస్తుంది. వాటి కదలికపై ప్రభావం చూపుతుంది.

"ఇది వయసుతోనో, రూపాన్ని బట్టో ఉండే సమస్య కాదు" అని డాక్టర్ గుప్తా వివరించారు. “తమ 30 ఏళ్ల ప్రారంభంలో ఉన్న మహిళలు లేదా శారీరకంగా ఫిట్‌గా కనిపించే పురుషులకు కూడా రక్తపోటు పెరిగి, అది వారి సంతానోత్పత్తి లక్ష్యాలకు రహస్యంగా అడ్డు పడుతుంది” అని చెప్పారు.

IVF వల్ల రక్తపోటు సమస్యలు పోవు

IVF అన్ని ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందనే ఒక సాధారణ అపోహ ఉంది. కానీ అది పూర్తిగా నిజం కాదు. మీకు అధిక రక్తపోటు ఉంటే, అది IVF మందులకు మీ శరీరం సానుకూలంగా స్పందించడాన్ని తగ్గిస్తుంది. పిండం అతుక్కుపోవడానికి ఆటంకం కలిగిస్తుంది. చికిత్స సమయంలో ఊహించని సమస్యలు వచ్చే అవకాశాలను పెంచుతుంది.

"IVF చికిత్సకు ముందు, మేం దంపతుల శారీరక ఆరోగ్యం, ప్రాథమిక పరీక్షలను అంచనా వేస్తాం" అని డాక్టర్ గుప్తా తెలిపారు. "ఇది మీ మనస్సు, శరీరం సిద్ధంగా ఉండటానికి ఒక ముఖ్యమైన భాగం. దీన్ని తర్వాత చూద్దాం అని వదిలేసే చిన్న విషయం కాదు.." అని డాక్టర్ వివరించారు.

గర్భధారణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి

‘‘గర్భధారణ సమయంలో రక్తపోటు నిరంతరం ఎక్కువగా ఉంటే, గర్భధారణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇది పిండం పెరుగుదల పరిమితం కావడం, ముందస్తు ప్రసవం, లేదా అరుదైన, తీవ్రమైన సందర్భాలలో ప్రీఎక్లాంప్సియా వంటి సమస్యలకు దారితీస్తుంది. IVF ద్వారా గర్భం దాల్చిన వారికి డాక్టర్ ద్వారా మరింత నిరంతర పర్యవేక్షణ అవసరం. రక్తపోటు ఈ సమస్యలను మరింత పెంచుతుంది. దంపతులు ఆందోళన చెందడం మాకు ఇష్టం లేదు. బదులుగా వారు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి" అని డాక్టర్ గుప్తా అన్నారు. "మీరు గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తుంటే, లేదా ఇప్పటికే గర్భవతి అయితే, రక్తపోటును అదుపులో ఉంచుకోండి. అది ఒక్కటే చాలా పెద్ద మార్పును తీసుకురాగలదు.." అని సూచించారు.

సంతానోత్పత్తి సమస్యలను హార్మోన్ల సమస్యలుగా మాత్రమే చూడకూడదంటున్న డాక్టర్లు
సంతానోత్పత్తి సమస్యలను హార్మోన్ల సమస్యలుగా మాత్రమే చూడకూడదంటున్న డాక్టర్లు (File Photo)

రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి సరైన మార్గం

మీరు గర్భం దాల్చడానికి ప్రయత్నించే ముందు కూడా మీ రక్తపోటును తనిఖీ చేయించుకోండి. అది ఎక్కువగా ఉంటే, దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు లేదా ఒత్తిడి వల్ల అని కొట్టిపారేయకండి. సురక్షితమైన మార్గాల్లో దాన్ని ఎలా అదుపులో ఉంచుకోవచ్చో మీ డాక్టర్, మీ సంతానోత్పత్తి నిపుణుడితో మాట్లాడండి. ఇందులో జీవనశైలి మార్పులు లేదా అవసరమైతే సురక్షితమైన మందులు తీసుకోవడం వంటివి ఉండవచ్చు.

"మీరు ఎంత ముందుగా చర్య తీసుకుంటే, మీ అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి" అని డాక్టర్ గుప్తా అన్నారు. "ఈ ఒక్క ముఖ్యమైన సమస్యను పరిష్కరించడం ద్వారా చాలా మంది దంపతులు తమ ఫలితాలను మెరుగుపరచుకోవడాన్ని మేం చూశాం. సమగ్ర వైద్య మార్గదర్శకత్వంతో సంతానోత్పత్తి చికిత్స కోసం, సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించండి.." అని డాక్టర్ సూచించారు.

(పాఠకులకు గమనిక: ఈ ఆర్టికల్ కేవలం సమాచారం కోసమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ డాక్టర్‌ను సంప్రదించండి.)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.