ప్రతి ఏడాది మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతూనే ఉంటాయి. విజేతగా ఎవరు నిలుస్తారా? అని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. వివిధ దేశాల నుండి అందమైన ప్రతిభావంతులైన మహిళలు ఎంతోమంది ఈ టైటిల్ కోసం పోటీ పడుతూ ఉంటారు. ఈసారి మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి.
మిస్ వరల్డ్ పోటీల్లో గెలిచిన అందమైన విజేతకు ఆమె కన్నా అందంగా ఉన్న కిరీటంతో సత్కరిస్తారు. ఆ కిరీటాన్ని చూడాలంటే రెండు కళ్ళు చాలవు. ముత్యాలు, వజ్రాలతో నిండిపోయి ఉంటుంది ఆ కిరీటం.
మిస్ వరల్డ్ కిరీటాన్ని జపనీస్ కంపెనీ అయినా మికిమోటో తయారు చేస్తోంది. కొన్నేళ్లుగా ఈ సంస్థనే మిస్ వరల్డ్ కిరీటాలను తయారుచేసి అందిస్తోంది. ఈ కిరీటం మధ్యలో నీలిరంగు గ్లోబ్ ఉంటుంది. దాని చుట్టూ ఖండాలను సూచించేలా ఆరు తెల్ల బంగారు కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలు ముత్యాలు, వజ్రాలతో అలంకరించి ఉంటాయి. నీలం, తెలుపు రంగులు ఈ కిరీటంలో కనిపిస్తాయి. విజేత తలకు సరిపోయేలా సర్దుబాటు చేసే అవకాశం కూడా ఉంటుంది.
ప్రస్తుతం వాడుతున్న మిస్ వరల్డ్ కిరీటాన్ని 2017లో తయారుచేశారు. మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో వాడిన కిరీటాల్లో ఇది నాలుగవది. ముందు వాడిన కిరీటాలను కూడా మికీమోటో కంపెనీనే తయారు చేసింది. 1951 నుండి 1973 వరకు ఉపయోగించిన మొదటి కిరీటంలో ముత్యాలు, వజ్రాలు కూడా నిండి ఉన్నాయి. ప్రతిసారి ఎంతో కొంత ప్రత్యేకంగా కిరీటాలను తయారు చేయడం మికీమోటో కంపెనీ ప్రత్యేకత.
మిస్ వరల్డ్ విజేతకు తొడిగే కిరీటం విలువ దాదాపు లక్ష డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 84 లక్ష రూపాయలకు పైగా ఉంటుంది. అయితే ఈ కిరీటం విజేత సొంతం కాదు. కేవలం మిస్ వరల్డ్ పోటీల్లో మాత్రమే దాన్ని ఆమె సొంతం చేసుకుంటుంది. ఆ తర్వాత మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తిరిగి తీసుకుంటుంది. అయితే ఆ విజేతకు ఈ కిరీటాన్ని పోలిన మరొక కిరీటాన్ని ఇస్తారు. దాన్నే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏడాది పాటు మిస్ వరల్డ్ విజేత వినియోగిస్తుంది.
మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటాలు అందమైనవి మాత్రమే కాదు, ఎంతో ఖరీదైనవి కూడా. అలాగే అర్థమంతమైనవి. ఈ ప్రపంచానికి ప్రతీకాత్మకంగా కనిపించేవి. ప్రపంచంలోనే వైవిధ్యం ఐక్యతను సూచించేలా ఈ కిరీటాలను తయారు చేస్తారు.
మన దేశానికి చెందిన రీటా ఫారియా, ఐశ్వర్య రాయ్, డయానా హెడెన్, యుక్తా ముఖి, ప్రియాంక చోప్రా, మౌనుషీ చిల్లర్... ఇంతవరకు మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుపొందారు. 2017లో చివరగా మానుషి చిల్లర్ మన దేశానికి మిస్ వరల్డ్ కిరీటాన్ని తీసుకువచ్చింది. ఆ తర్వాత మన దేశస్తులు ఎవరు విజేతగా నిలవలేదు.
మిస్ వరల్డ్ 2025 పోటీలో ఫేమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 విజేత నందిని గుప్తా పోటీపడుతోంది. నందిని గుప్తా రాజస్థాన్లోని కోటాలో జన్మించారు. ఈమె వయసు 21 సంవత్సరాలు. ముంబైలోని లాలా లజపతిరాయ్ కళాశాలలో ఆమె డిగ్రీ చదువుతున్నారు.