Chanakya Niti Telugu : వివాహానికి ముందు అమ్మాయి గురించి ఈ విషయాలు తెలుసుకోండి
Chanakya Niti On Wife : చాణక్య నీతి ప్రకారం పెళ్లికి ముందు భాగస్వామిలోని లక్షణాలను తెలుసుకోవాలి. అప్పుడే జీవితంలో హ్యాపీగా ఉంటారు. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
పెళ్లి కోసం జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనేది వ్యక్తి జీవితంలో అతి పెద్ద నిర్ణయాలలో ఒకటి. పెళ్లి అనేది రెండు మనసుల కలయిక. వివాహాన్ని ఒక జన్మకు సంబంధించిన బంధంగా పరిగణించకుండా ఏడు జన్మల సంబంధంగా చెబుతారు. జీవిత భాగస్వామిగా సరైన భాగస్వామిని ఎంచుకుంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. రెండు కుటుంబాలు కూడా ఆనందంగా ఉంటాయని చాణక్య నీతి చెబుతుంది.
చాణక్య నీతిలో చాణక్యుడు వివాహానికి సరైన భాగస్వామిని ఎంచుకోవడం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను చెప్పాడు. మీ జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు కొన్ని విషయాలను పరిశీలించాలి. అప్పుడే ఆనందంగా ఉండొచ్చు. ఈ విషయాలు తెలుసుకుని మీ భాగస్వామిని ఎంచుకోండి. మీ వైవాహిక జీవితం సంతోషంగా నడుస్తుంది.
వివాహానికి ముందు భార్య వారసత్వాన్ని తెలుసుకుంటే మంచిది. పెళ్లికి ముందు భాగస్వామి ఆర్థిక, సామాజిక, కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకోవాలి. వివాహం ఎల్లప్పుడూ సమానుల మధ్య ఉండాలని చాణక్యుడు చెప్పాడు. అప్పుడే భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. మీ భాగస్వామి కుటుంబం మీ కంటే తక్కువగా లేదా ఎక్కువగా ఉంటే, మీరు వివాహం తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మనసున్న వారితో మాత్రమే పెళ్లి చేసుకోండి.
అందం కోసం అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు. తెలివైన అందమైన, ప్రతిభావంతులైన స్త్రీని జీవిత భాగస్వామిగా కలిగి ఉండటం చాలా సంతోషం, ప్రయోజనకరంగా ఉంటుంది. చాణక్య నీతిలో దీని గురించి చెప్పాడు. అబద్ధాలు చెప్పేవారిని జీవిత భాగస్వామిగా ఎన్నుకోకండి. ఎందుకంటే అలాంటివారు జీవిత భాగస్వామిగా తెచ్చుకుంటే భవిష్యత్ జీవితానికి ప్రమాదకరం.
వివాహానికి ముందు, మీ భాగస్వామి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తారో లేదో తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే దేవుడిని నమ్మేవారు తమ గౌరవాన్ని మరచిపోరు. వారి జీవితాలు ఎప్పటికీ వారి కుటుంబానికి అంకితం చేస్తారని చాణక్య నీతి చెబుతుంది. అలాంటివారు ఎలాంటి చెడు పనులు చేయరని చాణక్యుడు పేర్కొన్నాడు.
సహనం, పట్టుదల ఉన్నవారు కుటుంబాన్ని అన్ని క్లిష్ట పరిస్థితుల నుండి రక్షిస్తారని చాణక్యనీతిలో చాణక్యుడు చెప్పాడు. సంక్షోభ సమయాల్లో దృఢంగా ఉండటమే కుటుంబానికి అండగా ఉంటుంది. పెళ్లికి ముందు, మీ భాగస్వామి సహనాన్ని కచ్చితంగా చూడాలి. కోపంతో ఉన్న వ్యక్తులు తప్పు అనే తేడాను మరచిపోతారు. కోపంగా ఉన్న వ్యక్తి తన భాగస్వామి జీవితంలో చాలా చికాకును సృష్టిస్తారు.
మంచి మాట మంచి బంధాన్ని ఏర్పరుస్తుంది. చెడ్డ మాట బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. భార్యాభర్తల మధ్య సామరస్యం దాంపత్య సుఖానికి కీలకం. మీ జీవిత భాగస్వామి నుండి చెడు మాటలు మీ దాంపత్యంలో చీలికలకు కారణం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పెళ్లికి ముందు మీ భాగస్వామి జీవనశైలి గురించి తెలుసుకోవాలి.