Rava Kesari Premix Powder: రవ్వ కేసరి ప్రీమిక్స్ పొడి ఇలా చేసి పెట్టుకుంటే సింపుల్‌గా ఆ స్వీట్ చేసేయచ్చు
Rava Kesari Premix Powder: పండగలు వస్తే ఎంతో మంది ఇళ్లల్లో రవ్వ కేసరి ఉంటుంది. దీన్ని ముందుగానే పొడి రూపంలో ప్రీ మిక్స్ చేసి పెట్టుకుంటే కావాల్సినప్పుడు పావుగంటలో రెడీ అయిపోతుంది.

Rava Kesari Premix Powder: రవ్వ కేసరి పేరు చెబితేనే నోరూరిపోతుంది. దీన్ని చేయడం చాలా సులువు. రవ్వ కేసరిని ఎప్పుడు కావాలంటే అప్పుడు పావుగంటలో వండేయాలంటే చిన్న చిట్కా ఉంది. ముందుగానే రవ్వ కేసరిని పొడి రూపంలో ఇన్స్టెంట్గా చేసి పెట్టుకోవాలి. ఈ రవ్వ కేసరి పొడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మీకు కావాల్సినప్పుడు రవ్వ కేసరి స్వీట్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ రవ్వ కేసరి ప్రీమిక్స్ తయారు చేయడం సులువుగానే ఉంటుంది. ఒకసారి దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.
రవ్వ కేసరి పొడి రెసిపీకి కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ - పావు కిలో
పంచదార - పావు కిలో
నెయ్యి - ఒక కప్పు
డ్రై ఫ్రూట్స్ - అరకప్పు
కుంకుమపువ్వు రేకులు - 4
యాలకుల పొడి - ఒక స్పూను
నీళ్లు - సరిపడినన్ని
పాలపొడి - అరకప్పు
రవ్వ కేసరి ప్రీమిక్స్ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేయాలి.
2. అందులో డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఆ పాన్ లోనే మరికొంచెం నెయ్యిని వేసి బొంబాయి రవ్వను వేయించుకోవాలి.
4. చిన్న మంట మీద ఈ రవ్వను బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.
5. బొంబాయి రవ్వ పూర్తిగా చల్లారనివ్వాలి.
6. ఇప్పుడు చల్లారిన రవ్వలో చక్కెర, డ్రై ఫ్రూట్స్, పాలపొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని డబ్బాలో వేసుకుంటే నాలుగైదు నెలలు తాజాగా ఉంటుంది.
మీకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు రవ్వ కేసరి స్వీట్ ను దీంతో చేసుకోవచ్చు. కేసరి చేయాలనుకున్నప్పుడు ఒక కప్పు నీళ్లలో కుంకుమపువ్వు వేసి స్టవ్ మీద పెట్టి మరగబెట్టండి. ఇది మరుగుతుండగా పక్కన స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేయండి. ఆ నెయ్యిలో ముందుగా చేసి పెట్టుకున్న రవ్వ కేసరి ప్రీమిక్స్ పౌడర్ ను వేసి చిన్న మంట మీద కలుపుతూ ఉండండి. ఆ రవ్వ వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ రవ్వను పక్కన మరుగుతున్న కుంకుమ పువ్వుల నీళ్లలో వేసి కలుపుకోవాలి. అది దగ్గరగా హల్వా లాగా అయ్యేంతవరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. దీని రుచి చాలా బాగుంటుంది. ఇలా పొడి చేసి పెట్టుకుంటే కేవలం 10 నిమిషాల్లో స్వీట్ రెడీ అయిపోతుంది.
అతిథులు ఇంటికి వచ్చినప్పుడు ఏం పెట్టాలో ఎక్కువ ఆలోచించకుండా ఇలా రవ్వ కేసరి స్వీట్ చేసి పెట్టేయొచ్చు. దీన్ని తడి తగలకుండా ఉంటే మూడు నాలుగు నెలల పాటు తాజాగా ఉంటుంది. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. ఈ స్వీట్ రెసిపీ కూడా అదిరిపోతుంది.