ఆలోచన అనేది రూపంలేని ఒక భావం. కానీ అది ఒక మనిషిని ఎంత ఎత్తుకైనా తీసుకెళ్తుంది లేదా అథ:పాతాళలానికైనా తొక్కేస్తుంది. ఒక వ్యక్తి తాను బలవంతుడు అనుకుంటే ఏదైనా సాధించగలడు. అదే తాను శక్తిసామర్థ్యాలు లేని వాడినని, బలహీనుడని అనుకుంటే విజయానికి సెంటీమీటర్ దూరంలో ఉన్న వాడు కూడా అపజయాన్ని మూటగట్టుకుంటాడు. కాబట్టి ఆలోచనలనేవి మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిద్దివిలా ఉండేలా మీరే చూసుకోవాలి.
మీ బలహీనతలు ఏంటో మీకే తెలుస్తుంది. మీ సమస్యలు కూడా మీకే తెలుస్తాయి. మీ అంతర్గత శక్తులు కూడా మీరే గుర్తించగలరు. కాబట్టి మిమ్మల్ని మీరు ఎలా బలవంతులు చేసుకోవాలో మీ ఆలోచనలే నిర్ణయిస్తాయి. పాజిటివ్ ఆలోచనలు మీరు బలవంతుడని చెబితే, నెగిటివ్ ఆలోచనలు మీరు బలహీనుడని చెబుతాయి. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైన వ్యక్తి ఏదీ సాధించలేడు. మంచి ఆలోచనలతో మిమ్మల్ని మీరు మార్చుకోగలరు.
ఆలోచనలే ఆచరణగా మారుతాయి. ప్రతి వ్యక్తి కూడా బాహ్య ప్రవర్తనకు ఆలోచనలే మూల కారణాలు. కాబట్టి ఆలోచనలు రెండు వైపులా పదునుండే కత్తిలాంటివి. అవి ఒక మనిషిని ఎంత ఉత్తేజపరచగలవో, అంతే నిరాశపరచగలవు. ఒక వ్యక్తి లక్ష్యాన్ని జయించడానికి ఎంత సహాయపడతాయో... ఆలోచనలు ఆ లక్ష్యాన్ని చేరకుండా అడ్డుకోవడంలో కూడా అంతే జోరుగా పనిచేస్తాయి. కాబట్టి మీ ఆలోచన సరళి... మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఒక మనిషి తన జీవితంలో సగభాగాన్ని అనవసరమైన ఆలోచనలతోనే గడిపేస్తాడని తెలుస్తోంది. అదే ఆలోచనలను ఆచరణలో పెడితే వారు ఈపాటికి ఏదో ఒక రంగంలో రాణించేవారు అని కూడా తెలుస్తోంది. మనోవిజ్ఞాన శాస్త్రం చెబుతున్న ప్రకారం ఆలోచనలు ఎంత ఉపయోగపడతాయో, అంత ప్రమాదకరమైనవి కూడా. కాబట్టి మీ ఆలోచనలు పాజిటివ్ గా ఉండేలా చూసుకోవాలి.
ఆలోచనలు అనేవి ఒక వరద నీరు అనుకోండి. ఆ వరద నీటికి కట్టడి వేయాల్సింది మీరే. కట్టడి చేయకుండా వదిలేస్తే అది మీ జీవితాన్నే ముంచేస్తుంది. కాబట్టి మీ ఆలోచనలను అదుపు చేసి, పాజిటివ్ గా మార్చుకోవాలి. మీ ఆలోచనలు మీ అదుపులోనే ఉండాలి. వాటికి మీరు లొంగిపోతే జీవితం చేజారిపోతుంది. కాబట్టి మీ ఆలోచనలపై పట్టు సాధించాలి. అదుపుతప్పిన ఆలోచనలు జీవితానికే ముప్పుగా పరిణమిస్తాయి.
యువతకు స్ఫూర్తి ప్రదాత, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానంద కూడా మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే తయారవుతారని చెప్పారు. అందుకే ఉన్నతంగా ఆలోచించాలని వివరించారు. మీరు బలమైన వారు అనుకుంటే ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తారని, బలహీనులు అనుకుంటే రెండు అడుగులు కూడా ముందుకు వేయలేరని చెప్పారు. కాబట్టి మీ ఆలోచనలో మీరు బలమైన వ్యక్తిగానే ఉండాలి. మీ బలహీన అలవాట్లను పదేపదే తలుచుకోకూడదు.
ఒక మనిషి అంతరంగంలో ఉన్న భావాలు, ఆలోచనలు అతని భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. అతని వ్యక్తిత్వానికి పునాదిరాళ్లుగా మారతాయి. కాబట్టి మీ ఆలోచనల్లో సానుకూలతను పెంచండి. మీరు ఏ పనైనా విజయవంతంగా చేయగలుగుతారని మిమ్మల్ని మీరు నమ్మండి. తమపై తమకు నమ్మకం లేనివారు ఏదీ సాధించలేరు. కుండ పాలను విరిచేయడానికి ఒక్క నిమ్మ చుక్క చాలు. అలాగే సానుకూల జీవితంలో ఒక్క నెగిటివ్ ఆలోచన చాలు మీ లక్ష్యం, మీ విజయం దూరం అయిపోతాయి. కాబట్టి వీలైనంతవరకు మీరు పాజిటివ్ ఆలోచనలతో బలమైన వారిగా భావించి జీవించడం ఉత్తమం.
సంబంధిత కథనం