బిజీ జీవితానికి యోగా గురువు సౌరభ్ బోత్రా చెప్పిన 5 మంచి అలవాట్లు.. ఓ అద్భుతమైన చిట్కా-yoga trainer saurabh bothra shares 5 healthy habits for busy lives ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  బిజీ జీవితానికి యోగా గురువు సౌరభ్ బోత్రా చెప్పిన 5 మంచి అలవాట్లు.. ఓ అద్భుతమైన చిట్కా

బిజీ జీవితానికి యోగా గురువు సౌరభ్ బోత్రా చెప్పిన 5 మంచి అలవాట్లు.. ఓ అద్భుతమైన చిట్కా

HT Telugu Desk HT Telugu

చిన్న చిన్న అలవాట్లు బిజీ జీవితం గడిపేవారికి కూడా చాలా మేలు చేస్తాయని యోగా ట్రైనర్ సౌరభ్ బోత్రా చెబుతున్నారు. ఎక్కువగా కదలడం, సరిపడా నీళ్లు తాగడం, వ్యాయామం చేయడం, తగినంత నిద్ర పోవడం వంటివి ఇందులో ఉన్నాయి.

బిజీ జీవితాలు గడిపే వారికి చిన్న చిన్న ఆరోగ్య అలవాట్లు మేలు చేస్తాయంటున్న యోగా ట్రైనర్ (Saurabh Bothra)

ఫిట్‌నెస్ కోసం రోజూ సమయం కేటాయించలేకపోతున్నారా? లేదా డైట్‌ పాటించడం కష్టంగా ఉందా? అలాంటి వాళ్లు కొన్ని మంచి అలవాట్లను ప్రతిరోజూ పాటిస్తే చాలు, జీవితంలో పెద్ద మార్పులు వస్తాయని యోగా గురువు సౌరభ్ బోత్రా అంటున్నారు. కష్టమైన, భారీ మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన సూచిస్తున్నారు.

'హాబిల్డ్' అనే తన ప్లాట్‌ఫామ్‌ ద్వారా అలవాట్లు నేర్పించే ప్రోగ్రామ్‌లు, ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న బోత్రా లైవ్‌మింట్ ఇంటర్వ్యూలో ఆరోగ్యంగా జీవించడానికి తన టాప్ 5 చిట్కాలను పంచుకున్నారు.

నీళ్లు తాగండి:

యోగా కోచ్ చెప్పినట్లు నీళ్లు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. దీనికి తోడు బోత్రా ఇంకో లాభం కూడా ఉందని చెబుతున్నారు. "ఎక్కువ నీళ్లు తాగితే వాష్‌రూమ్‌కి ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల కదలిక పెరుగుతుంది" అని ఆయన వివరించారు.

కదలండి:

మీరు కూర్చొని ఎక్కువ సమయం గడిపే ఉద్యోగి అయితే, కనీసం ప్రతి గంట తర్వాత లేచి కాసేపు తిరగడానికి ప్రయత్నించండి. "మా ఆఫీసులో, ప్రతి గంట తర్వాత 3 నిమిషాల పాటు ఏదో ఒక పని చేస్తాం. మేము స్క్వాట్స్ చేస్తాం. లోతైన శ్వాస తీసుకుంటాం లేదా కదలికను పెంచే ఏదైనా చేస్తాం" అని బోత్రా చెప్పారు.

లోతైన శ్వాస:

నాగ్‌పూర్ చెందిన ఈ ట్రైనర్ పనులతో బిజీగా ఉండేవాళ్లకు లోతైన శ్వాసను గట్టిగా సిఫార్సు చేస్తున్నారు. కేవలం 5 నిమిషాల పాటు శ్వాసపై దృష్టి పెట్టడం కూడా పని, ఇంటి ఒత్తిళ్ల మధ్య నలిగిపోయే వారికి చికిత్సలా పనిచేస్తుందని ఆయన అంటున్నారు. "ఇది ఒత్తిడిని తగ్గించడానికి గొప్ప మార్గం" అని ఆయన చెప్పారు. బోత్రా బాక్స్ బ్రీతింగ్ (పీల్చడం, పట్టి ఉంచడం, వదలడం, పట్టి ఉంచడం), కోహెరెంట్ బ్రీతింగ్ (సుమారు 5 సెకన్ల పాటు పీల్చడం, వదలడం) వంటివి సూచిస్తున్నారు.

సమయానికి పడుకోండి:

చిన్నప్పుడు మన పెద్దలు మాటిమాటికీ చెప్పిన విషయమే ఇది. ఇప్పుడు పెద్దయ్యాక, మీ నిద్రను పట్టించుకోవాల్సిన సమయం వచ్చింది. "ప్రతి ఒక్కరూ కనీసం రాత్రి 11:00 గంటలకంటే ముందే పడుకోవాలి. మీరు ఎంత బిజీగా ఉన్నా, రాత్రి 11:00 గంటల తర్వాత చాలా మంది కేవలం టైమ్ పాస్ చేస్తూ ఉంటారు. మంచి నిద్ర, సరిపడా నిద్ర చాలా ముఖ్యమైన ఆరోగ్యకరమైన అలవాట్లు" అని ఆయన తెలిపారు.

వ్యాయామం చేయండి:

మీ షెడ్యూల్ ప్రతిరోజూ వ్యాయామం చేయడానికి కుదరకపోతే, కనీసం వారానికి మూడుసార్లు, ఒక్కొక్కసారి 45 నిమిషాల పాటు చేయాలని బోత్రా సూచిస్తున్నారు. ఆయన తన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా యోగా నేర్చుకోవడానికి ప్రజలకు సహాయం చేస్తారు.

ఈ చిట్కాలతో పాటు ఆయన ఒక ఇంకో చిట్కా కూడా పంచుకున్నారు. "ఒకేసారి 5 పనులు చేయడానికి ప్రయత్నించకండి. ఒక చిన్న పనిని 7 రోజులు లేదా 14 రోజులు చేసి, ఆపై ఇంకొకటి ప్రయత్నించండి. ఆపై ఇంకొకటి. అన్నీ ఒకేసారి చేయడానికి ప్రయత్నించవద్దు, లేకపోతే మనం విఫలమవుతాం. ఆపై మళ్ళీ జనవరి 1వ తేదీ రావడానికి ఎదురుచూస్తాం" అని ఆయన చెప్పారు.

ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి?

ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం కూడా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా ముఖ్యమైన భాగం. ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారని అడిగినప్పుడు "నన్ను నిజంగా ఇబ్బంది పెట్టే రోజులు ఉంటాయి. ఒత్తిడిని ఎదుర్కోవడానికి నాకు తెలిసిన ఉత్తమ పద్ధతి నిద్రపోవడమే. కాబట్టి నేను బిజీగా ఉన్న రోజుల్లో, ముందుగానే పడుకుంటాను. తద్వారా నా మరుసటి రోజు మెరుగ్గా ఉండేలా చూసుకోగలను" అని వివరించారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.