Yoga Poses for Constipation: మలబద్ధకంతో బాధపడుతున్నారా? సమస్యను తగ్గించగల యోగాసనాలు ఇవి
Yoga Poses for Constipation: మలబద్ధకం సమస్యను కొన్ని యోగసనాలు తగ్గించగలవు. పొత్తి కడుపుపై ఒత్తిడి వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికి పోయేందుకు సహకరిస్తాయి. ఆ యోగాసనాలు ఏవంటే..
యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. వివిధ రకాల ఆసనాలు.. కొన్ని రకాల ఇబ్బందులను తగ్గేలా చేస్తాయి. ప్రస్తుత చలికాలంలో కొందరికి మదబద్ధకం సమస్య తీవ్రంగా ఉంటుంది. ఆహారం సరిగా జీర్ణం అవకుండా ఉంటుంది. అయితే, పేగుల కదలికను కొన్ని యోగాసనాలు మెరుగుపరిచి.. మలబద్ధకం సమస్య తగ్గేందుకు తోడ్పడతాయి. శరీరంలోని వ్యర్థాలు మెరుగ్గా బయటికి వెళ్లేలా సహకరిస్తాయి. అలాంటి యోగాసనాల గురించి ఇక్కడ చూడండి.
పవన్ముక్తాసనం
పవన్ముక్తాసనం వేయడం వల్ల పేగులపై ఒత్తిడి పడుతుంది. కదలిక పెరుగుతుంది. పొత్తి కడుపు అవయావాలపై కూడా ప్రెజర్ ఉంటుంది. దీంతో పేగుల కదలిక పెరిగి మలబద్ధకం తగ్గేలా ఈ ఆసనం చేయగలదు. పవన్ముక్తాసనం వేసేందుకు, ముందుగా కింద వెల్లకిలా పడుకొని.. మోకాళ్లను మడిచి.. ఛాతి వద్దకు తీసుకురావాలి. ఛాతి వద్దకు వచ్చిన మోకాళ్లను నదుటికి ఆనించాలి.
బాలాసనం
బాలాసనం వేయడం వల్ల నాడీవ్యవస్థ, జీర్ణవ్యవస్థ ప్రేరేపణకు గురవుతాయి. ఈ ఆసనం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. పేగులు మెరుగ్గా కదుతాయి. శరీరంలోని వ్యర్థాలు సులువుగా బయటికి వెళ్లేందుకు ఈ ఆసనం తోడ్పడుతుంది. బాలాసనం వేసేందుకు.. ముందుగా ఓ చోట మోకాళ్లపై కూర్చోవాలి. ఆ తర్వాత ముందుకు వంగి ముంజేతులను చాపి నేలకు ఆనించాలి. నుదురు కూడా నేలకు ఆనించాలి. పిల్లలు బోర్లా పడుకున్నట్టుగా ఈ ఆసనం ఉంటుంది.
త్రికోణాసనం
శరీరాన్ని మెలిపెడుతూ చేసే త్రికోణాసనం.. మలబద్ధకం సమస్య తగ్గేందుకు తోడ్పడుతుంది. పొత్తు కడుపు, వెన్నుపై ఈ ఆసనం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పూర్తి శరీరం జీవక్రియను ఈ ఆసనం మెరుగుపరుస్తుంది. దీంతో జీర్ణక్రియకు సహకరించి.. వ్యర్థాలు బయటికి వెళ్లేలా ఉపయోగపడుతుంది. ఓ చోట నిల్చొని.. కుడి చేతి వేళ్లతో ఎడమ పాదాన్ని.. ఆ తర్వాత ఎడమ చేతి వేళ్లతో కుడి పదాన్ని తాకేలా నడుమును వంచి, శరీరాన్ని ట్విస్ట్ చేస్తూ త్రికోణాసనం చేయాలి.
మలాసనం
మలాసనం వేయడం వల్ల పొత్తి కడుపుపై ఒత్తిడి పడుతుంది. దీంతో అక్కడి కండరాలకు మసాజ్ అయినట్టుగా జరుగుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగవుతుంది. పేగుల మూవ్‍మెంట్ పెరుగుతుంది. దీంతో మలబద్ధకం తగ్గేలా ఆ ఆసనం చేయగలదు. మలాసనం వేసేందుకు, ముందుగా ఓ చోట నిల్చుని కాళ్లను దూరంగా జరపాలి. ఆ తర్వాత మోకాళ్లను, కింది భాగాన్ని వంచి కూర్చున్నట్టుగా చేయాలి. పాదాల భారం వేస్తూ ఉండాలి. మలవిసర్జనకు కూర్చున్నట్టుగా ఈ భంగిమ ఉంటుంది. ఆ ఆసనం వేసేందుకు కూడా సులభమే. శరీరంలోని వ్యర్థాలు మెరుగ్గా బయటికి వెళ్లేలా చేస్తుంది.