Yoga Vs Gym: యోగా, జిమ్.. రెండిట్లో ఏది లాభదాయకం? వివరంగా తెలుసుకోండి..-yoga or gym which is better for your health expert reveals ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Yoga Or Gym, Which Is Better For Your Health, Expert Reveals

Yoga Vs Gym: యోగా, జిమ్.. రెండిట్లో ఏది లాభదాయకం? వివరంగా తెలుసుకోండి..

Koutik Pranaya Sree HT Telugu
Aug 29, 2023 09:07 PM IST

Yoga Vs Gym: కొంతమంది యోగా మంచిదంటే.. మరికొందరు జిమ్ చేయడం మంచిదంటారు. ఇంతకీ మీకు నప్పేది, మంచి ఎంపికేదో తెలుసుకోండి.

యోగా వర్సెస్ ఎక్సర్‌సైజ్
యోగా వర్సెస్ ఎక్సర్‌సైజ్ (Pixabay, Freepik)

ఆరోగ్యం కోసం, బరువు తగ్గడం కోసం రకరకాల వ్యాయామాలు, కసరత్తులు చేస్తుంటాం. ఎవరి ఇష్టానికి తగ్గట్లు వాళ్లు వివిధ పద్ధతుల్ని ఎంచుకుంటారు. కండలు తిరిగిన శరీరం కోసం ప్రయత్నించే వాళ్లు జిమ్ కి వెళ్తారు. బరువు తగ్గి, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం చూసేవాళ్లు యోగా ఎంచుకుంటారు. కొంతమంది ఒత్తిడి తగ్గించుకోడానికి ఆసనాలు, ప్రాణాయామాలు చేస్తారు. అయితే యోగా మంచిదా, జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయడం మంచిదా అనే సందేహం ఉండొచ్చు. దానిగురించి నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

యోగా Vs ఎక్సర్‌సైజ్:

యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. యోగా చేస్తున్నప్పుడు శరీరాన్ని కదిలించడమే కాక మరేదో నేర్చుకోవాల్సిన విషయం ఉందనిపిస్తుంది. ఆసనాల వల్ల బోలెడు లాభాలున్నాయి. ఇక జిమ్ వెళ్లడం, ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల కండరాలు ఫిట్ గా అవుతాయి. యోగా వల్ల శరీరం తేలికగా కదిలించగలుగుతారు. బలం పెరుగుతుంది. శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలో యోగా నేర్పుతుంది. ఇక ఎక్సర్‌సైజ్ విషయానికొస్తే బయట కనిపించే శరీరాకృతి మీదే కేంద్రీకృతమై ఉంటుంది. కానీ యోగాలో చేసే ఆసనాల వల్ల శరీరానికి మానసికంగా, శారీరకంగా సాంత్వన పొందిన భావన వస్తుంది.

యోగాకు పరికరాలు అక్కర్లేదు, ఎక్సర్‌సైజ్ కోసం ప్రత్యేక పరికరాలు అవసరం:

యోగా చేయడానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఒక యోగా మ్యాట్ ఉంటే సరిపోతుంది. ఎక్కడికైనా మ్యాట్ తీసుకుని వెళ్లి యోగా చేసేయొచ్చు. కొన్ని ఎక్సర్‌సైజులు చేయాలంటే పరికరాలు అక్కర్లేదు. కానీ సరైన శారీరక బలం, ఫ్లెక్సిబిలిటీ కోసం కావాలంటే మంచి పరికరాలు అవసరం అవుతాయి. జిమ్ వెళ్లి తప్పకుండా అక్కడే కసరత్తులు చేయాల్సి ఉంటుంది.

యోగా వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది:

యోగా అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనస్సుకు, మన భావోద్వేగాలకు కూడా ప్రయోజనం కలిగించే అత్యంత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అభ్యాసం. యోగా అనేక ఆసనాల గురించి చెబుతుంది. దాంతో పాటే ఆలోచనలను నియంత్రించడానికి ఉపయోగించే శ్వాస పద్ధతులను కూడా బోధిస్తుంది. ఈ విధంగా మీ ఇంద్రియాలు, భావోద్వేగాలపై నియంత్రణ సాధించడానికి యోగా సాయపడుతుంది.

యోగా ఆందోళన, నిరాశ తగ్గిస్తుంది:

యోగా 84 లక్షల భంగిమలు, 300 ప్రాణాయామ పద్ధతులు, అనేక ధ్యాన పద్ధతులతో సహా విస్తృతమైన సంపదను కలిగి ఉంది. యోగా 5,000 సంవత్సరాల నాటిది. ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలను ఎక్సర్‌సైజ్ వల్ల తగినంతగా పరిష్కారం కాకపోవచ్చు. కానీ మానసిక శ్రేయస్సు కోసం, యోగా ఉత్తమమైంది. అలాగే యోగా వల్ల ఎలాంటి గాయాలయ్యే అవకాశం కూడా ఉండదు. ఎక్సర్‌సైజ్ చేసేటపుడు ఈ అవకాశం ఎక్కువ.

ఫిట్‌నెస్ కోసం యోగా, ఎక్సర్‌సైజ్ రెండూ మంచి పద్ధతులే. దేనికదే ప్రత్యేకం. దేని లాభాలు దానికి. మీకున్న లక్ష్యాలు, అవసరాల ఆధారంగా యోగా లేదా ఎక్సర్‌సైజ్ ఎంచుకోవచ్చు.

WhatsApp channel

టాపిక్