పీసీఓఎస్ (PCOS) లేదా పీసీఓడీ (PCOD) సమస్యలను నియంత్రించడానికి యోగా అద్భుతంగా పని చేస్తుందని యోగా కోచ్‌లు చెబుతున్నారు. బటర్‌ఫ్లై పోజ్, భుజంగాసనం వంటి 7 ఆసనాలు రోజూ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఓ యోగా కోచ్ సూచించారు.
యోగా గురువు రజత్ తరచుగా ఆరోగ్య సమస్యలను లక్ష్యంగా చేసుకుని ఇంట్లో చేయగలిగే వివిధ యోగా భంగిమలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటారు. ఇటీవల ఆయన ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్), పీసీఓడీ (పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్) సమస్యలతో బాధపడుతున్న మహిళలకు సహాయపడే 7 యోగాసనాల గురించి వివరించారు.
రజత్ పీసీఓఎస్, పీసీఓడీతో బాధపడేవారు తప్పకుండా చేయాల్సిన 7 యోగాసనాలను సూచిస్తూ, అవి ఎలా చేయాలో వివరించారు. ఈ ఆసనాలను మొత్తం 20 నిమిషాలు చేయాలని చెప్పారు. ప్రతి ఆసనానికి ఎంత సమయం కేటాయించాలో కూడా సూచించారు.
PACE హాస్పిటల్స్ ప్రకారం పీసీఓడీ అనేది అండాశయాలు అపరిపక్వమైన లేదా పాక్షికంగా పరిపక్వమైన గుడ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే పరిస్థితి. ఇది సాధారణంగా సరైన జీవనశైలి లేకపోవడం, ఊబకాయం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత వల్ల సంభవిస్తుంది. పీసీఓఎస్ అనేది ఒక జీవక్రియ రుగ్మత (మెటబాలిక్ డిజార్డర్). ఇది పీసీఓడీకి మరింత తీవ్రమైన రూపం. దీని వల్ల అండాశయాలు అండాలను విడుదల చేయడాన్ని పూర్తిగా నిలిపివేస్తాయి.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ప్రకారం పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) లక్షణాలను తగ్గించడంలో ఔషధాలతో పాటు యోగా సమర్థవంతమైన ప్రభావాన్ని చూపుతుందని నిరూపితమైంది.
HT లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిమాలయన్ సిద్ధా అక్షర్ మాట్లాడుతూ, "పీసీఓఎస్ సంబంధిత బరువు పెరుగుదలను నియంత్రిస్తూనే యోగా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది జీవక్రియను, మెదడుకు రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. తద్వారా హార్మోన్ల సమతుల్యతను తిరిగి స్థాపిస్తుంది. యోగా చేయడం వల్ల గర్భధారణ, సంతానోత్పత్తి అవకాశాలు కూడా పెరుగుతాయి" అని వివరించారు.
(పాఠకులకు గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యల గురించి సందేహాలు ఉంటే ఎల్లప్పుడూ మీ డాక్టర్‌ను సంప్రదించండి.)