World thyroid day 2024: థైరాయిడ్ సమస్యను సహజంగానే ఇలా దూరం చేసుకోండి, చిట్కాలు ఇవిగో
World thyroid day 2024: సమతుల్య ఆహారం తీసుకోవడం నుండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వరకు సహజంగానే థైరాయిడ్ సమస్యను తగ్గించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.

World thyroid day 2024: మెడ దిగువన ఉన్న చిన్న గ్రంథి థైరాయిడ్. ఇది ముఖ్యమైన రెండు హార్మోన్ల స్రావానికి కారణమవుతుంది. అవి థైరాక్సిన్ (టి 4), ట్రైయోడోథైరోనిన్ (టి 3). అవి రెండూ కలిసి థైరాయిడ్ హార్మోన్ ను ఏర్పరుస్తాయి. థైరాయిడ్ హార్మోన్ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి, థైరాయిడ్ గ్రంథికి వచ్చే వ్యాధులకు కారణమయ్యే పరిస్థితుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏటా ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని మే 25న నిర్వహించుకుంటారు. థైరాయిడ్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఇబ్బంది పెడుతోంది. ఆహార, జీవనశైలి పద్ధతులను మార్చుకోవడం ద్వారా థైరాయిడ్ వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచడానికి సహజ మార్గాలు
సమతుల్య ఆహారం తీసుకోండి: ఆరోగ్యకరమైన వివిధ రకాల ఆహారాన్ని తింటూ ఉండాలి. వాటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉండాలి. ఇందు కోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను పుష్కలంగా ఉండాలి. చేపలు, చికెన్, కోడి గుడ్లు, చిక్కుళ్ళు వంటి లీన్ ప్రోటీన్ ఉన్న ఆహారాలను తినడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి సవ్యంగా జరగుతుంది. సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు చేపలను తినడం వల్ల ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి అందుతాయి. ఇది శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్‌ను తగ్గిస్తాయి. థైరాయిడ్ పనితీరుకు మద్దతు ఇస్తాయి.
సెలీనియం: థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి సెలీనియం కీలకమైన ఖనిజం. బ్రెజిల్ నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, సీఫుడ్, గుడ్లు, తృణధాన్యాలలో సెలీనియం నిండుగా ఉంటుంది. వీటిని ప్రతిరోజూ తినడం ద్వారా సెలీనియం పొందవచ్చు.
వ్యాయామం: మొత్తం ఆరోగ్యానికి వ్యాయామం ఒక శక్తివంతమైన సాధనం. థైరాయిడ్ పనితీరు దీనికి మినహాయింపు కాదు. చురుకైన నడక, స్విమ్మింగ్, సైక్లింగ్, నృత్యం వంటివి ప్రతిరోజూ ఒక అరగంట పాటూ చేయడం చాలా అవసరం. వ్యాయామం జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం… రెండింటినీ అదుపులో ఉంచుతుంది.
ఒత్తిడి: దీర్ఘకాలిక ఒత్తిడి థైరాయిడ్ పనితీరుతో సహా మీ హార్మోన్లను దెబ్బతీస్తుంది. యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు వంటివి ఒత్తిడిని తగ్గించేందుకు సహకరిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ అరగంట పాటూ వీటికి సమయాన్ని కేటాయించండి.
నాణ్యమైన నిద్ర: థైరాయిడ్ హార్మోన్ల నియంత్రణకు నాణ్యమైన నిద్ర చాలా అవసరం. ఈ హార్మోన్లు జీవక్రియ, పెరుగుదల, అభివృద్ధితో సహా వివిధ శారీరక విధులలో కీలక పాత్ర పోషిస్తాయి. సరైన థైరాయిడ్ పనితీరును నిర్వహించడానికి, ప్రతి రాత్రి మీకు 6-8 గంటల నిద్ర అవసరం.
టాపిక్